2వేల రూపాయల నోటు రద్దుపై కేంద్రం క్లారిటీ

  • Published By: chvmurthy ,Published On : December 10, 2019 / 01:19 PM IST
2వేల రూపాయల నోటు రద్దుపై కేంద్రం క్లారిటీ

Updated On : December 10, 2019 / 1:19 PM IST

దేశంలో 2వేల రూపాయల నోటు రద్దు చేస్తారని వస్తున్న వార్తలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రవేశపెట్టిన 2వేలు రూపాయలనోటును కేంద్రం రద్దు చేస్తుందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కేంద్ర ఆర్ధికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టంచేశారు.  దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. రాజ్యసభలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో రాబోయే రోజుల్లో రూ. 2000 నోటును ప్రభుత్వం ఉపసంహరిస్తుందా అన్న ప్రశ్నకు బదులిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
 

కేంద్రం 2వేల రూపాయల నోటును ప్రవేశపెట్టడంతో దేశంలో నల్లధనం పెరిగిపోయిందని, దాని స్ధానంలో ప్రభుత్వం తిరిగి రూ.1000 నోటును ప్రవేశపెడుతుందని ప్రజల్లో ఓ ప్రచారం సాగుతోందని ఎస్పీ సభ్యుడు విశ్వంభర్‌ ప్రసాద్‌ నిషద్‌ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. నల్లధనాన్ని నిర్మూలించి నకిలీ నోట్లను తొలగించేందుకే నోట్ల రద్దును ప్రభుత్వం చేపట్టిందని మంత్రి ఠాకూర్‌ చెప్పారు.

అసంఘటిత రంగాన్ని సంఘటిత పరచడంతో పాటు తీవ్రవాద నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడం ద్వారా ఆన్‌లైన్‌ లావాదేవీలను నోట్ల రద్దు ద్వారా పెంచగలిగామని ఆయన తెలిపారు.