Sabarimala Pilgrimage: శబరిమలలో ప్రతీరోజూ 90వేల మందికే అనుమతి.. దర్శనం వేళల్లో మార్పులు
కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రంకు భక్తులు పోటెత్తుతున్నారు. రికార్డు స్థాయిలో భక్తులు వస్తుండటంతో పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈక్రమంలో కేరళ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీరోజూ 90వేల మంది భక్తులను మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. దర్శన సమయం వేళలను ఓ గంటపాటు పెంపుచేశారు.

Sabarimala Pilgrimage
Sabarimala Pilgrimage: కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. సోమవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 1,07,260 మంది భక్తులు దర్శనం కోసం ముందస్తు బుకింగ్ చేసుకున్నారు. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం కాగా, లక్ష మార్కు దాటడం మాత్రం ఇది రెండోసారి. ఇదిలాఉంటే శనివారం ఒక్కరోజే లక్షమందికిపైగా భక్తులు బుకింగ్ చేసుకోగా 90వేల మంది ఆలయాన్ని దర్శించినట్లు సమాచారం. ఇలా విపరీతమైన రద్దీని నియంత్రించే క్రమంలో కొందరు భక్తులతో పాటు పోలీసు సిబ్బందికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. శబరిమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకొనేందుకు సోమవారం ప్రభుత్వం కీలక నిర్ణంయ తీసుకుంది.
Sabarimala: శబరిమలకు ఒక్క రోజే లక్ష మంది భక్తులు.. పెరిగిన రద్దీపై సీఎం విజయన్ సమీక్ష
శబరిమలలోని అయ్యప్ప పుణ్యక్షేతానికి తీర్థయాత్రకోసం వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో కేరళ ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీరోజూ 90వేల మంది యాత్రికులను మాత్రమే అనుమతించాలని నిర్ణయించింది. అయితే, దర్శనం సమయాన్ని గంటపాటు పొడిగించింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
రాష్ట్రంలోని పతనంతిట్ట జిల్లాలోని శబరిమల వద్ద ప్రతీరోజూ 90వేల మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించేలా సమావేశంలో నిర్ణయించినట్లు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) చైర్మన్ కె. అనంతగోపాల్ తెలిపారు. కేరళ హైకోర్టు సూచన మేరకు దర్శనం వేళలుసైతం పెంచారు. రోజూ ఉదయం దర్శన సమయాలను తెల్లవారు జామున 3 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు, మధ్యాహ్నం సమయంలో మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు భక్తుల దర్శనానికి అనుమతించాలని సమావేశంలో నిర్ణయించినట్లు టీడీబీ అధ్యక్షులు తెలిపారు. అంతకుముందు ఉదయం 3 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు ఆలయాన్ని తెరిచి ఉంచేవారు.
ఇదిలాఉంటే.. నవంబర్ 17న ప్రారంభమైన 41రోజుల మండల పూజా ఉత్సవాలు డిసెంబర్ 27న ముగుస్తాయి. ఆ తర్వాత 14జనవరి 2023న ముగిసే మకరవిళక్కు పుణ్యక్షేత్రం కోసం మళ్లీ డిసెంబర్ 30న ఆలయాన్ని తెరవనున్నారు. పుణ్యక్షేత్రం 20 జనవరి 2023న మూసివేయడం జరుగుతుంది. గత రెండేళ్లుగా కరోనా కారణంగా ప్రతీరోజూ 30వేల మంది భక్తులనే అనుమతించేవారు. ఈ ఏడాది అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పై ఎటువంటి పరిమితులు లేకపోవటంతో నిత్యం భారీ సంఖ్యలో అయ్యప్ప భక్తులు ఆలయాన్నిసందర్శించేందుకు బారులు తీరుతున్నారు.