అత్త గొప్ప మనసు : కోడలికి మళ్లీ పెళ్ళి చేసింది

సాధారణంగా అత్తగారు అనగానే గయ్యాళి సూర్యకాంతం పాత్ర గుర్తుకు వచ్చి కోడల్ని రాచి రంపాన పెట్టే క్యారెక్టర్లు, తెలుగు సీరియల్స్ లో వచ్చే వివిధ అత్త పాత్రలు పోషిస్తున్న ఆర్టిస్టులు గుర్తుకు వచ్చి విపరీతమైన కోపం రావటం సహజం. కానీ కోడలు పరిస్దితి చూసి మాతృమూర్తిగా మారిన లేటెస్ట్ అత్తమ్మ ఒడిశాలో ఉంది.
వివరాల్లోకి వెళితే …. ఒడిశాలోని అనుగుల్ ప్రాంతం గోబరా గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ప్రతిమా బెహరా తన కుమారుడు రష్మి రంజన్ కు 2019 ఫిబ్రవరిలో తురాంగ గ్రామానికి చెందిన లిల్లీ బెహరా తో వివాహం జరిపించింది. వివాహం జరిగి కొత్త దంపతులు సంతోషంతో కాపురం చేస్తున్నారు. జులై లో రష్మి రంజన్ పని చేస్తున్న గనిలో జరిగిన ప్రమాదంలో రష్మిరంజన్ కన్నుమూశాడు. దీంతో కోడలు వితంతువుగా మారింది. కొడుకు పోయిన బాధ కన్నా వితంతువుగా మారిన కోడలిని చూసి ప్రతిమా బెహరా చలించిపోయింది. కేవలం 5 నెలలు మాత్రమే వైవాహిక జీవితాన్ని చూసిన లిల్లీ కి కొత్త జీవితాన్ని ఇవ్వాలని నిశ్చయించింది.
లిల్లీని తన మేనల్లుడు సంగ్రామ్ కి ఇచ్చి మళ్లీ పెళ్లిచేసి ఆమెకు కొత్త జీవితాన్నివ్వాలనుకుంది. అనుకున్నదే తడువుగా తన అన్నను సంప్రదించింది. చెల్లెలి ప్రతిపాదనకు అంగీకరించాడు ఆమె అన్నయ్య. ఇంట్లో కోడలికి నచ్చచెప్పి పెళ్లికి సిధ్దం చేసింది. బుధవారం సెప్టెంబరు 11న అనుగుల్ లోని జగన్నాధ ఆలయంలో లిల్లీతల్లి తండ్రుల సమక్షంలో వివాహం జరిపించింది. సొంత కూతురుని పెళ్లి జరిపించినట్లు దగ్గరుండి అన్నీ జరిపించి సంప్రదాయబద్దంగా అత్తవారింటికి పంపించటం చెప్పుకోతగ్గ విషయం.