Omar Abdullah: జమ్మూకశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం.. కేబినెట్‌లో చేరని కాంగ్రెస్.. ఎందుకంటే?

జమ్మూ కశ్మీర్ నూతన ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనచే లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రమాణ స్వీకారం చేయించారు.

Omar Abdullah: జమ్మూకశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం.. కేబినెట్‌లో చేరని కాంగ్రెస్.. ఎందుకంటే?

Omar Abdullah

Updated On : October 16, 2024 / 12:57 PM IST

Omar Abdullah Oath Taking : జమ్మూ కశ్మీర్ నూతన ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రమాణ స్వీకారం చేయించారు. ఒమర్ అబ్దుల్లాతోపాటు ఐదుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా సురేంద్ర చౌదరి ప్రమాణ స్వీకారం చేయగా.. జావేద్ దార్, సకినా ఇట్టు, జావేద్ రానా, సతీష్ శర్మలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో భారత కూటమి నేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, సుప్రియా సూలె, అఖిలేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలపై ఈసీ కీలక వ్యాఖ్యలు.. అసలు నిజం ఇదే..!

జమ్మూ కశ్మీర్ లో పదేళ్ల తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ, కాంగ్రెస్ కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 90 నియోజకవర్గాలకుగాను 48 స్థానాలను కూటమి గెలుచుకుంది. ఇందులో ఎన్సీ 42 స్థానాల్లో విజయం సాధించగా.. మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీ కేవలం ఆరు సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఆ తరువాత ఐదుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, ఒక ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి మద్దతు ప్రకటించారు. నేషనల్ కాన్ఫరెన్స్ శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలంటూ ఎన్సీతో పాటు కాంగ్రెస్ నుంచి ఎల్జీకి విజ్ఞప్తులు వెళ్లాయి. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు, సీఎం ప్రమాణ స్వీకారానికి లెఫ్టినెంట్ గవర్నర్ ఆహ్వానించడంతో బుధవారం సీఎంగా ఒమర్ అబ్దుల్లా, ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

 

జమ్మూకశ్మీర్ నూతన ప్రభుత్వంలో కాంగ్రెస్ నుంచి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని భావించినప్పటికీ.. ఒమర్ అబ్దుల్లా కేబినెట్ లోకి చేరేందుకు కాంగ్రెస్ విముఖత వ్యక్తం చేసింది. ఒకరికి మంత్రి పదవి ఆఫర్ చేసినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం అందుకు ఒప్పుకోలేదని, బయట నుంచి ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని చెప్పినట్లు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతల పనితీరుపై హైకమాండ్ అసంతృప్తిగా ఉందని, పదవులకు కాకుండా జమ్మూకశ్మీర్ లో పార్టీ బలోపేతానికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి కృషి చేయాలని స్థానిక నేతలను కాంగ్రెస్ పెద్దలు ఆదేశించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

జమ్మూకశ్మీర్ లో అసెంబ్లీ (90 స్థానాలు) ఫలితాలు..
నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) : 42
బీజేపీ – 29
కాంగ్రెస్ -06
పీడీపీ – 03
జేపీసీ – 01
సీపీఎం- 01
ఆమ్ ఆద్మీ పార్టీ – 01
స్వతంత్రులు – 07