Pahalgam Attack: ‘గుడారంలో దాక్కున్నాం.. మూడేళ్ల చిన్నారి ఉందని చెప్పినా వదల్లేదు’.. కన్నీరు పెట్టిస్తున్న సుజాత భూషణ్ మాటలు
మూడేళ్ల బిడ్డ కోసమైనా తనను వదిలేయండి అంటూ భరత్ భూషణ్ ఉగ్రవాదులను వేడుకున్నా వదల్లేదు..

Bharath Bhushan with Family
Pahalgam Attack: పహల్గాంలో ఉగ్రవాదులు కనికరం లేకుండా ప్రవర్తించారు. హనీమూన్ కోసం కశ్మీర్ కు వెళ్లిన కొత్త జంటల జీవితాలను చిదిమేశారు. మరోవైపు.. మాకు చిన్న పిల్లలు ఉన్నారని వేడుకున్నా కనికరం చూపలేదు.. తుపాకీ గురిపెట్టి తలపై పేల్చేశారు. ఈ దారుణమైన ఉగ్రదాడిలో 26మంది పేర్లతో చనిపోయినట్లు అధికారులు జాబితాను విడుదల చేశారు. వీరిలో బెంగళూరు వాసి భరత్ భూషణ్ కూడా ఒకరు. తన భార్య సుజాత, మూడేళ్ల కుమారుడి ముందే ఉగ్రవాదులు భరత్ భూషణ్ ను హతమార్చారు.
భరత్ భూషణ్ భార్య సుజాత భూషణ్ వైద్యురాలు. వారికి మూడేళ్ల చిన్నారి ఉంది. వారంతా కలిసి ఈనెల 18న విహారయాత్రకు కశ్మీర్ వెళ్లారు. ఏప్రిల్ 23న బెంగళూరుకు తిరిగి రావాల్సి ఉంది. అయితే, మంగళవారం మధ్యాహ్నం పహల్గాం సమీప ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో భరత్ భూషణ్ చనిపోయాడు. తన భార్య సుజాత జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఆ భయంకరమైన క్షణాలను గుర్తు చేసుకొని కన్నీరుమున్నీరైంది.
‘మేము ఏప్రిల్ 18న సెలవులకు విహారయాత్ర కోసం కాశ్మీర్ వెళ్లాం. పహల్గాం మా చివరి స్టాప్. మంగళవారం మేము బైసరన్ వరకు గుర్రం రైడ్ పై వెళ్లాం. మేము అక్కడికి చేరుకొని మా బిడ్డతో కలిసి ఫొటోలను దిగాం. అక్కడ కొద్దిసేపు ఆడుకున్నాం. కాశ్మీరి దుస్తులను కూడా ధరించాం. కొద్దిసేపటికి మాకు తుపాకీ పేలిన శబ్దాలు వినిపించాయి. తొలుత సైనికులు శిక్షణ పొందుతున్నారని భావించాం. కానీ తుపాకీ పేలుళ్లు దగ్గరకు వస్తున్నా కొద్ది ఇది ఉగ్రవాదుల దాడి అని గ్రహించాం. మేము అక్కడి నుంచి పరుగెత్తేందుకు ప్రయత్నించాం. సమయం లేకపోవటంతో.. ముగ్గురం పక్కనే ఉన్న గుడారాల వెనుక దాక్కున్నాం.
ఒక ఉగ్రవాది మాకు దాదాపు 100 అడుగుల దూరంలో ఉన్న ఒక టెంట్ లోకి వెళ్లాడు. అతను ఒక వ్యక్తి బయటకు తీసుకెళ్లి అతనితో మాట్లాడుతున్నట్లు అనిపించింది. అతని తలపై కాల్చాడు. అతను మళ్లీ రెండు సార్లు అలానే కాల్చాడు. తరువాత ఆ ఉగ్రవాది మేము దాక్కున్న గుడారం వద్దకు వచ్చాడు. నా భర్త ఆ ఉగ్రవాదిని ‘‘నాకు ఒక బిడ్డ ఉంది. దయచేసి నన్ను వదిలేయండి’ అని అడుగుతున్నాడు. కానీ, అతను కనికరించలేదు. తలపై కాల్చి చంపి వెళ్లిపోయాడు’’ అంటూ సుజాత కన్నీటి పర్యాంతమైంది.