Vikram Misri: ఉగ్రవాదంపై దొంగ నాటకాలు, దొంగ లెక్కలు- పాకిస్తాన్‌పై విరుచుకుపడ్డ భారత విదేశాంగ శాఖ కార్యదర్శి

ఉద్రిక్తతలను పెంచే విధంగా మేము వ్యవహరించడం లేదు. పాకిస్తాన్ దాడులకు మేము ప్రతి దాడులు మాత్రమే చేస్తున్నాం.

Vikram Misri: ఉగ్రవాదంపై దొంగ నాటకాలు, దొంగ లెక్కలు- పాకిస్తాన్‌పై విరుచుకుపడ్డ భారత విదేశాంగ శాఖ కార్యదర్శి

Updated On : May 8, 2025 / 8:23 PM IST

Vikram Misri : Operation Sindoor Updates: ఆపరేషన్ సిందూర్, అనంతర పరిణామాలపై భారత విదేశాంగ, రక్షణశాఖలు సంయుక్త ప్రెస్ మీట్ నిర్వహించాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాక్ మధ్య ఉద్రిక్తలపై ప్రత్యేక బ్రీఫింగ్ ఇచ్చారు. ఇవాళ్టి వైమానిక దాడులపై వివరణ ఇచ్చారు అధికారులు.

పాకిస్తాన్ దొంగ నాటకాలు ఆడుతోందని, దొంగ లెక్కలు చెబుతోందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి మండిపడ్డారు. టెర్రరిస్టులకు పాక్ అడ్డాగా మారిందని, సీమాంతర తీవ్రవాదాన్ని పాక్ పెంచి పోషిస్తోందని ఆయన అన్నారు. అంతర్జాతీయ సమాజానికి పాక్ తప్పుడు సమాచారం ఇస్తోందని ఆరోపించారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు సురక్షిత స్వర్గధామం అన్నారాయన. పహల్గామ్ ఉగ్రదాడి దర్యాప్తులో పాక్ సంబంధం బయటపడిందన్నారు.

”పహల్గాం దాడి చేసింది తామేనని టీఆర్ఎఫ్ ప్రకటించింది. ఉగ్రదాడితో మాకు సంబంధం లేదని పాక్ చెబుతోంది. టీఆర్ఎఫ్ ను ఉగ్రవాద సంస్థగా పాక్ ఎందుకు ప్రకటించడం లేదు? పహల్గాం ఉగ్రదాడితో పాక్ కు సంబంధం ఉంది. అన్ని ఆధారాలను ఇప్పటికే ఐక్యరాజ్యసమితికి అందించాం” అని విక్రమ్ మిస్రీ తెలిపారు.

Also Read: పాకిస్తాన్‌ను చావు దెబ్బ కొట్టిన భారత సుదర్శన చక్రం S-400.. పాక్ మిస్సైళ్లు, డ్రోన్లు ధ్వంసం.. రక్షణ వ్యవస్థ తుక్కుతుక్కు

”పాక్ సైనాధ్యక్షుడు ఆసిమ్ మునీర్ మాటలకు, పహల్గాం దాడులకు సంబంధం ఉంది. పహల్గాం దాడులతో పాక్ కవ్వింపు చర్యలకు దిగింది. దానికి భారత్ స్పందించాల్సి వచ్చింది. తప్పుడు సమాచారంతో పాక్ మతం రంగు పులుముతోంది. ఆపరేషన్ సిందూర్ లో పాక్ పౌరులు చనిపోయారు అనేది పూర్తిగా అవాస్తవం. ఇప్పటికీ ఉగ్రవాదాన్ని వదులుకోవడానికి పాక్ సిద్ధంగా లేదు” అని భారత విదేశాంగా శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మండిపడ్డారు.

”ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడితో పాకిస్తాన్ ఉద్రిక్తతలు సృష్టించింది. దానికి బదులుగానే మేము జవాబు ఇచ్చాము. పహల్గాం ఉగ్రదాడికి బాధ్యులం తామేనని రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది. ఆ తర్వాత ప్రకటనను ఉపసంహరించుకునే ప్రయత్నం చేసింది. దాన్ని ఎవరూ నమ్మరు. ఉద్రిక్తతలను పెంచే విధంగా మేము వ్యవహరించడం లేదు. పాకిస్తాన్ దాడులకు మేము ప్రతి దాడులు మాత్రమే చేస్తున్నాం. కేవలం ఉగ్రవాద స్థావరాలపై దాడులకు దిగాం. పాకిస్తాన్ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తోంది. ఉగ్రవాదంతో తమకు సంబంధాలే లేవని పాకిస్తాన్ చేతులు కడుక్కునే ప్రయత్నం చేస్తోంది. గ్లోబల్ టెర్రరిజానికి పాకిస్తాన్ కేంద్ర బిందువు” అని విక్రమ్ మిస్రీ అన్నారు.