Delhi Air Pollution: ఢిల్లీ పొల్యూషన్‌కు సొల్యూషన్ ఏదీ? పార్లమెంట్‌లో చర్చిస్తామంటూనే పక్కనపెట్టేసిన కేంద్రం..
కనీసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకైనా పంపించాలని డిమాండ్ చేసినా కేంద్రం లైట్ తీసుకుంది.
Delhi Air Pollution: పార్టీల మధ్య ఆరోపణలు పక్కన పెట్టి చర్చిద్దామన్నారు. అలానే ఢిల్లీ పొల్యూషన్‌కు సొల్యూషన్ కనుక్కుందామన్నారు. తీరా చూస్తే ఆ సమయం రాగానే తాము అనుకున్న బిల్లులను మాత్రం పట్టాలెక్కింపజేసి సభను వాయిదా వేశారు కేంద్ర పెద్దలు. 15 రోజుల పాటు జరిగిన పార్లమెంట్ వింటర్ సెషన్స్‌లో ఎన్డీయే కీలకంగా తీసుకున్న 3 బిల్లులను ఆమోదించగా, కాలుష్యం సమస్యపైన మాత్రం వాయిదా మంత్రమే పటించింది. దీంతో సభ నిరవధిక వాయిదా తర్వాత కూడా విపక్షాలు ఆందోళనకే పరిమితం కావాల్సి వచ్చింది.
గత వారంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ..డిమాండ్ చేయడం..ఎన్డీఏ వెంటనే ఓకే చెప్పిన కాలుష్యం సమస్యపై చర్చ లేకుండానే సెషన్స్ ముగిశాయ్. ఐతే ఎన్డీఏ తాను అనుకున్న బిల్స్ మాత్రం పాసైపోయాయ్. విపక్షాల డిమాండ్లు ఆందోళనలకే పరిమితం అయ్యాయ్.
డిసెంబర్ 1 నుంచి ప్రారంభమైన వింటర్ సెషన్స్.. షెడ్యూల్ ప్రకారమే డిసెంబర్ 19నే ముగిశాయ్. అపోజిషన్ పార్టీలు.. ఇన్సూరెన్స్ రంగంలో ఎఫ్‌డిఐలు.. న్యూక్లియర్ అటామిక్ ఎనర్జీ బిల్‌తో పాటు విబీ జీఆర్జీ బిల్‌ని వ్యతిరేకించాయ్. కనీసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకైనా పంపించాలని డిమాండ్ చేసినా కేంద్రం లైట్ తీసుకుంది.
మరోవైపు ఢిల్లీని పొగమంచు కమ్మేయడంతో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏకంగా 445 పాయింట్లకు చేరింది. ఒకే రోజు 152 విమానాలు రద్దయ్యాయ్. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో కనీసం 100 మీటర్ల వరకూ కంటికి ఎదురుగా ఏం జరుగుతుందో కన్పించని పరిస్థితి నెలకొంది. ఉత్తరప్రదేశ్‌లోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. కోర్టులు కూడా దేశ రాజధానిలోని కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి నేపథ్యంలో తప్పనిసరిగా పార్లమెంట్‌లో పొల్యూషన్‌పై చర్చ జరుగుతుందని ఎక్కువమంది అంచనా వేశారు. ఐతే కేంద్రం మాత్రం దాని ఊసే లేకుండా వ్యవహరించడంతో..కాలుష్యం మాట గాలికి వదిలేసినట్లైందని రాజకీయ విమర్శలు వస్తున్నాయ్.
