PM Modi : అయోధ్య అభివృద్ధి ప్రణాళికపై ప్రధాని మోదీ సమీక్ష
ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్య అభివృద్ధి ప్రణాళికను ప్రధాని మోదీ సమీక్షించారు. అయోధ్య ఆలయంతోపాటు నగర అభివృద్ధిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమర్పించిన ప్రణాళికను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరిశీలించారు.

Modi
Ayodhya : ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్య అభివృద్ధి ప్రణాళికను ప్రధాని మోదీ సమీక్షించారు. అయోధ్య ఆలయంతోపాటు నగర అభివృద్ధిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమర్పించిన ప్రణాళికను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరిశీలించారు. ఈ సమీక్ష వర్చువల్ పద్ధతిలో నిర్వహించారు ప్రధాని మోదీ. అంతర్జాతీయ పర్యాటక ప్రాంతంగా అయోధ్యను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ ప్రణాళికను రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన టౌన్‌షిప్, టూరిజం బోర్డు, విమానాశ్రయం, సరయూ నదీ తీర ప్రాంత అభివృద్ధి, రామాలయం నిర్మాణం, రామాలయం నుంచి రోడ్డు వరకు అనుసంధానం గురించి ఈ ప్రణాళికలో వివరించారు.
అయోధ్య సర్వతోముఖాభివృద్ధి కోసం బ్లూప్రింట్, విజన్ డాక్యుమెంట్‌లను తయారు చేసేందుకు అంతర్జాతీయ కన్సల్టెంట్ సంస్థ అయిన ఎల్ఈఏ అసోసియేట్స్ సౌత్ ఆసియా ప్రైవేట్ లిమిటెడ్‌తో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అభివృద్ధి ప్రణాళికలో భాగంగా చేపట్టనున్న 27 ప్రాజెక్టుల జాబితాను సమర్పించింది. వీటిలో 10 ప్రాజెక్టులకు సంబంధించిన సవివరమైన నివేదికలను త్వరలోనే తయారు చేయనున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ, అభివృద్ధి మండలి చైర్‌పర్సన్ దీపక్ కుమార్ చెప్పారు.
అయోధ్యను దేశంలోని అన్ని ప్రాంతాలకు అనుసంధానం చేయడం కోసం 100 కోట్ల రూపాయలతో అయోధ్య రైల్వే స్టేషన్‌ను ఆధునికీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయోధ్య విమానాశ్రయం కోసం రాష్ట్ర ప్రభుత్వం 321 కోట్ల రూపాయలు విడుదల చేసింది. దీనికి మర్యాదా పురుషోత్తమ్ శ్రీరామ్ విమానాశ్రయంగా నామకరణం చేయనున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం కోసం అదనంగా 555 ఎకరాల భూమిని సేకరించేందుకు వెయ్యి కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం అదనంగా మరో 250 కోట్లు విడుదల చేసింది.