Modi-Putin : అప్ఘాన్ పరిస్థితులపై 45 నిమిషాలు ఫోన్ లో మాట్లాడుకున్న మోదీ-పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోన్ చేశారు.

Modi Putin
Modi-Putin రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోన్ చేశారు. తాలిబన్ల ఆక్రమణతో అప్ఘానిస్తాన్ లో తలెత్తిన సంక్షోభంపై ఇరు దేశాధినేతలు చర్చించుకున్నారు. దాదాపు 45 నిమిషాలపాటు వారి మధ్య ఫోన్ సంభాషణ కొనసాగింది. ఆ 45 నిమిషాల్లో వారు పూర్తిగా ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితుల గురించే చర్చించుకున్నట్లు ప్రధాని కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
పుతిన్ తో ఫోన్ సంభాషణ అనంతరం ప్రధాని మోదీ ఓ ట్వీట్ లో..అప్ఘానిస్తాన్‌లో పరిణామాలపై నా మిత్రుడు పుతిన్‌తో అభిప్రాయాలు పంచుకున్నా. ద్వైపాక్షిక అజెండా, కొవిడ్ పై పోరులో భారత్- రష్యా మధ్య భాగస్వామ్యం గురించి కూడా చర్చించాం. ముఖ్యమైన విషయాలపై ఇరువురూ సంప్రదింపులు జరుపుకోవాలని అంగీకరించుకున్నట్లు తెలిపారు.
ఇక, సోమవారం జర్మనీ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్‌తోనూ మోదీ చర్చలు జరిపారు. అప్ఘాన్ సంక్షోభంపై నేతలిద్దరూ మాట్లాడుకున్నారని పీఎంఓ తెలిపింది. అఫ్గాన్‌లో శాంతిభద్రతలు కాపాడటం కీలకమని ఇరువురు పేర్కొన్నట్లు పీఎంఓ ప్రకటనలో వెల్లడించింది. అక్కడ చిక్కుకున్నవారిని రప్పించేందుకు నేతలు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపింది.
కాగా, భారత్.. ఆపరేషన్ దేవి శక్తి పేరుతో ఆఫ్ఘాన్ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. అప్ఘాన్‌ను తాలిబన్లు తమ అధీనంలోకి తెచ్చుకున్న మరునాడు ఆగస్టు 16 నుంచి భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. భారత్ ఇప్పటివరకు 800కిపైగా మందిని అప్ఘానిస్తాన్ నుంచి తీసుకొచ్చింది. వీరిలో భారతీయులతో పాటు అఫ్గాన్ సిక్కులు, హిందువులు ఉన్నారు.