Independence Day 2023: నారీ శక్తి, యువశక్తి భారత్‌కు బలం.. మణిపుర్ అంశాన్ని ప్రస్తావించిన ప్రధాని మోదీ
గత పదేళ్లుగా భారత్ గొప్పతనాన్ని ప్రపంచం గుర్తిస్తోందని, శాటిలైట్ రంగంలో మనమే ముందున్నామని, రాబోయే కాలాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ శాసిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు.

PM Narendra Modi
PM Narendra Modi: 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు విషయాలను ప్రముఖంగా ప్రస్తావించారు. ముందుగా దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనది. దేశంకోసం ఎంతో మంది త్యాగం చేశారు. అమరవీరుల త్యాగఫలమే స్వాతంత్రం అని ప్రధాని అన్నారు. ప్రపంచం మొత్తం భారత్‌వైపే చూస్తోంది. డిజిటల్ ఇండియాను ప్రపంచం గమనిస్తోందని పేర్కొన్నారు. మానవ వనరులు, ప్రజాస్వామ్యం, భిన్నత్వంలో ఏకత్వమే మన బలమని తెలిపారు. గత పదేళ్లలో భారత్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందింది. నారీ శక్తి, యుశక్తి భారత్‌కు బలం. భారత్‌లో యుశక్తి ఎంతో అద్భుతంగా ఉంది. భారతీయ యువత టెక్నాలజీ విషయంలో ముందున్నారని, భారత్‌లో యువతకు అవకాశాలు మెండుగా ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఆధునికతవైపు దేశం అడుగులు వేస్తోందని చెప్పారు.
గత పదేళ్లుగా భారత్ గొప్పతనాన్ని ప్రపంచం గుర్తిస్తోందని మోదీ అన్నారు. శాటిలైట్ రంగంలో మనమే ముందున్నామని, రాబోయే కాలాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ శాసిస్తుందని చెప్పారు. కరోనా కాలంలో మనమేంటో ప్రపంచానికి తెలిసింది. కరోనాను భారత్ కలిసికట్టుగా ఎదుర్కొందని అన్నారు. సుస్థిర శక్తివంతమైన ప్రభుత్వం భారత్‌కు అవసరం. సుస్థిర ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. 140 కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్నామని, మరో వెయ్యేళ్లు భారత్ వెలుగుతూనే ఉంటుందని ప్రధాని మోదీ చెప్పారు. ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ తన ప్రసంగంలో మణిపుర్ అంశాన్ని ప్రస్తావించారు. మణిపుర్‌లో జరిగిన హింస అత్యంత బాధాకరమైంది. దేశ ప్రజలంతా మణిపుర్‌కు అండగా ఉన్నారు. మణిపుర్‌లో శాంతి స్థాపనకు కేంద్రం సహకరిస్తుందని, మణిపుర్‌లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు.
Delhi : ఢిల్లీ ఎర్రకోటలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. ఢిల్లీలో భారీ భద్రత, ట్రాఫిక్ ఆంక్షలు
ప్రజలకు అవినీతి రహిత పాలన అందిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ బాగుంటే దేశం బాగుంటుందని చెప్పారు.పేద, మధ్య తరగతి వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని, పీఎం స్వనిధి పథకం ద్వారా 50వేల కోట్లు ఖర్చు చేశామని ప్రధాని చెప్పారు. రూ. 4లక్షల కోట్లతో పేదలకు ఇళ్లు నిర్మించాం. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను నెరవేరుస్తున్నామని మోదీ అన్నారు. వ్యవసాయ రంగంలోనూ దేశం చాలా అభివృద్ధి చెందిందని, క్రీడా రంగంలో యువత సత్తా చాటుతున్నారని చెప్పారు. గత పదేళ్లలో దేశంలో ఎన్నో కీలక సంస్కరణలు తీసుకొచ్చామని, రాబోయే కాలంలో మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చి దేశ ప్రజలు గర్వించేలా చేస్తామని ప్రధాని అన్నారు.
దేశ ప్రజలందరికీ ఇంటర్నెట్ ను అందుబాటులోకి తీసుకొచ్చామని, వచ్చే ఐదేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. ఆర్థిక వ్యవస్థలో అమెరికా, చైనా తర్వాత భారత్ ఉంటుందని, భారత్ అభివృద్ధిపై నాకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. జన ఔషధితో ప్రజలందరికీ చౌకగా ముందులు అందజేస్తున్నామని ప్రధాని అన్నారు. జన ఔషధి కేంద్రాల సంఖ్య 10వేల నుంచి 25వేలకు పెంచామని చెప్పారు. జన్‌ధన్ ఖాతాలో పేదల బతుకుల్లో వెలుగు నింపాం. మూరుమూల గ్రామాలకు విద్యుత్ సదుపాయం కల్పించామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.