భారత్‌పై ట్రంప్ విధించిన టారిఫ్‌పై రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష నేతలు ఏమన్నారో తెలుసా?
"మనం అమెరికాతో సానుకూలంగా ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోతే ఇతర మార్కెట్ల వైపు వెళ్లాలి. మనదేశం చైనాలా ఎగుమతులపై ఆధారపడదు. మన దేశంలో బలమైన అంతర్గత మార్కెట్ ఉంది. ఒప్పందం సాధ్యపడకపోతే, వెనక్కి తగ్గాల్సి వస్తుంది” అన్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత దిగుమతులపై 25 శాతం టారిఫ్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై భారత్‌లోని పలువురు ప్రతిపక్ష నేతలు స్పందించారు.
ట్రంప్ భారత్‌ను “డెడ్ ఎకానమీ”గా అభివర్ణిస్తూ చేసిన కామెంట్లపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ భారత ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని రాహుల్ ఆరోపించారు.
“భారత ఆర్థిక వ్యవస్థ నాశనమైంది. దానిని మోదీ నిర్జీవంగా చేశారు. అదానీ, మోడీ పార్ట్‌నర్‌షిప్, పెద్ద నోట్ల రద్దు, లోపభూయిష్ట జీఎస్టీ, “అసెంబుల్ ఇన్ ఇండియా” విఫలం, ఎంఎస్‌ఎంఈలు బలహీనపడ్డాయి, రైతులు ధీనస్థితిలో ఉండడం వంటి వాటిని భారత్‌లో చూడొచ్చు” అని తెలిపారు. ఉద్యోగాలు కూడా లేవని, భారత యువత భవిష్యత్తును మోదీ నాశనం చేశారని అన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కూడా మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. “భారతదేశం నుంచి అమెరికాకు చేసే ఎగుమతులపై 25 శాతం టారిఫ్‌తో పాటు రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు పెనాల్టీలు విధించడంతో భారత వాణిజ్యానికి పెద్ద ఎదురుదెబ్బ తగులుతోంది. అమెరికా విధించిన టారిఫ్ WTO నియమాలకు విరుద్ధంగా ఉంది. MIGA + MAGA = MEGA ఏవైంది?” అని ప్రశ్నించారు.
లోకసభ ఎంపీ శశిథరూర్ స్పందిస్తూ.. అమెరికా డిమాండ్లు అన్యాయంగా ఉంటే భారత్ ఇతర ప్రత్యామ్నాయాలు అన్వేషించాల్సి వస్తుందని అన్నారు. “మనము చాలా దేశాలతో చర్చలు కొనసాగిస్తున్నాం. అమెరికా ఒక్కటే కాదు. ఐరోపా యూనియన్‌తో చర్చలు జరుగుతున్నాయి, యూకేతో ఒప్పందం పూర్తయింది, ఇంకా కొన్ని దేశాలతో మాట్లాడుతున్నాం.
మనం అమెరికాతో సానుకూలంగా ముందుకు వెళ్లకపోతే, ఇతర మార్కెట్ల వైపు వెళ్లాలి. మనదేశం చైనాలా ఎగుమతులపై ఆధారపడదు. మన దేశంలో బలమైన అంతర్గత మార్కెట్ ఉంది. ఒప్పందం సాధ్యపడకపోతే, వెనక్కి తగ్గాల్సి వస్తుంది” అన్నారు.
AIMIM నేత అసదుద్దీన్ ఒవైసీ టారిఫ్‌పై స్పందిస్తూ.. “శ్వేతసౌధంలోని ఒక బఫూన్ ఇన్ చీఫ్‌తో నా దేశ ప్రభుత్వం బెదిరింపులకు గురికావడం చూస్తే బాధేస్తోంది. రష్యాతో వాణిజ్యం చేస్తున్నందుకు ‘పెనాల్టీ’ కూడా ఉండబోతోంది. భారత్ స్వతంత్ర, సార్వభౌమ దేశం. చక్రవర్తి ఆస్థానంలో సలామీ ఇచ్చే ఒక సామంత దేశం కాదు” అని అన్నారు.
ట్రంప్ భారత వాణిజ్య విధానాలపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. “భారతదేశం మన మిత్రదేశం అయినా, ఆ దేశంతో మనం ఎక్కువ వ్యాపారం చేయలేకపోయాం, ఎందుకంటే అక్కడ టారిఫ్‌లు చాలా ఎక్కువగా ఉన్నాయి” అని అన్నారు.