ప్రియాంకా గాంధీ నామినేషన్ వేయనున్న వేళ రాహుల్ గాంధీ ఆసక్తికర ట్వీట్
ఆ నియోజక వర్గ ప్రజలకు తన సోదరి ప్రియాంకా గాంధీ కంటే మెరుగైన ప్రతినిధి మరొకరు ఉండబోరని తాను అనుకుంటున్నట్లు తెలిపారు.

Priyanka Gandhi and Rahul Gandhi
కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ బుధవారం నామినేషన్ వేయనున్న నేపథ్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఓ ట్వీట్ చేశారు. వయనాడ్ ప్రజలకు తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు.
ఆ నియోజక వర్గ ప్రజలకు తన సోదరి ప్రియాంకా గాంధీ కంటే మెరుగైన ప్రతినిధి మరొకరు ఉండబోరని తాను అనుకుంటున్నట్లు తెలిపారు. వాయనాడ్ ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రియాంక గాంధీ పనిచేస్తారని, పార్లమెంటులో శక్తిమంతంగా గళాన్ని వినిపిస్తారని తాను నమ్ముతున్నట్లు చెప్పారు.
ప్రియాంకా గాంధీ వాయనాడ్ లోక్‌సభ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేస్తున్నందున అక్టోబర్ 23న తమతో కలిసి రావాలని స్థానిక ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. కాగా, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) అభ్యర్థిగా ప్రియాంకా గాంధీ పార్లమెంటు ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నారు.
నామినేషన్ దాఖలుకు ముందు ప్రియాంక, రాహుల్ గాంధీ కలిసి రోడ్‌షో నిర్వహిస్తారు. వయనాడ్ ఉప ఎన్నికలకు నవ్య హరిదాస్ బీజేపీ తరఫున పోటీకి దిగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ వాద్రాతో ఆమె పోటీ పడనున్నారు.