IRCTC : ఇక జంతువులకు ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్లు బుకింగ్
మీరు మీ పెంపుడు జంతువుల్ని రైల్లో మీతోపాటు తీసుకెళ్లాలనుకుంటున్నారా? దాని కోసం ఇబ్బంది పడుతున్నారా? వాటి కూడా టికెట్ తీసుకునే విషయంలో పార్శిల్ కౌంటర్ వద్ద ఇబ్బందులు పడుతున్నారా? ఇకపై అటువంటి ఇబ్బందులేమీ లేకుండా చేయాలనుకుంటోంది రైల్వే శాఖ.

IRCTC Online ticket booking pets
IRCTC : మీరు మీ పెంపుడు జంతువుల్ని రైల్లో మీతోపాటు తీసుకెళ్లాలనుకుంటున్నారా? దాని కోసం ఇబ్బంది పడుతున్నారా? వాటి కూడా టికెట్ తీసుకునే విషయంలో పార్శిల్ కౌంటర్ వద్ద ఇబ్బందులు పడుతున్నారా? ఇకపై అటువంటి ఇబ్బందులేమీ లేకుండా చేయాలనుకుంటోంది రైల్వే శాఖ. ఇకపై పెంపుడు జంతువులకు టికెట్లు ఆన్ లైన్ లోనే తీసుకునే సౌకర్యాన్ని కల్పించే ప్రతిపాదన చేస్తోంది.
శ్రీమంతులు వారు ఎక్కడికైనా వెళ్లే సమయంలో వారి పెంపుడు జంతువల్ని కూడా వారితో పాటే తీసుకెళుతుంటారు.విమానాల్లో కూడా తీసుకెళుతుంటారు. అదే రైళ్లలో ముఖ్యంగా ఏసీ బోగీల్లో పెంపుడు జంవుల్ని తీసుకెళ్లటానికి కొన్ని ఇబ్బందులుంటాయి. వాటికి కూడా టికెట్ తీసుకోవాలంటే పార్శిల్ కౌంటర్ లో తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ పెద్ద క్యూ ఉంటుంది.
కానీ ఇకనుంచి అటువంటి ఇబ్బంది లేకుండా వారితో పాటు వారి పెంపుడు జంతువులకు కూడా ఆన్ లైన్ లోనే టికెట్ తీసుకునే అవకాశాన్ని కల్పించాలని నిర్ణయించింది రైల్వేశాఖ. పెంపుడు జంతువులు గలవారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
రైళ్లలో పెంపుడు జంతువులను తీసుకెళ్లేందుకు ఆన్‌లైన్‌లోనే టిక్కెట్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించే ప్రతిపాదనను రైల్వే శాఖ పరిశీలిస్తోంది. టీటీఈలకూ ఈ టిక్కెట్లను జారీ చేసే అధికారాన్ని ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే పెంపుడు జంతువులతో రైలు ప్రయాణాలు ఇక ఈజీ అవ్వనున్నాయి.
కాగా ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం..ఏసీ బోగీల్లో మరి ముఖ్యంగా ఫస్ట్ క్లాస్ బోగీల్లో ప్రయాణించేవారికి తమ వెంటనే పెంపుడు జంతువుల్ని తీసుకెళ్లటానికి అనుమతి ఉంది. ప్రయాణీకులు ఆన్ లైన్ లో టికెట్స్ రిజర్వ్ చేసుకున్నా..వారి పెంపుడు జంతువులకు అటువంటి సౌకర్యం లేదు. ప్రయాణికులు స్టేషన్‌లోని పార్సిల్ కౌంటర్‌లో ఓ టిక్కెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక సెకండ్ క్లాస్ లగేజ్ లేదా బ్రేక్ వ్యాన్‌లో ఒక బాక్స్‌లో కూడా పెంపుడు జంతువులను తీసుకెళ్లొచ్చు. వాటికి కూడా కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంది.
కానీ రైల్వే శాఖ తీసుకున్న ఈ కొత్త ప్రతిపాదనతో ఇక పెంపుడు జంతువులకు తరలింపుకు అటువంటి ఇబ్బంది ఉండదు. పెంపుడు జంతువులకు ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేయాలనే అంశాన్ని రైల్వే శాఖ పరిశీలిస్తోంది. దీనికి అనుగుణంగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో మార్పులు చేయాలని రైల్వే శాఖ సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్స్ సిస్టమ్స్‌కు సూచించినట్లుగా సమాచారం.