ఉగ్రదాడి : కన్నబిడ్డను కళ్లారా చూడకుండానే జవాన్ మరణం

జమ్ము కశ్మీర్ : ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర జవానుల కుటుంబాలు కన్నీటి సంద్రాలుగా మారిపోయాయి. ఉగ్రదాడి ఘటన అనంతరం యావత్ భారత దేశంతో పాటు ఈ ఘోరకలిని ప్రపంచ దేశాలన్నీ ఖండించాయి. దాడి ఘటనపై తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దాడిలో మొత్తం 49 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర దాడి ఘటన ప్రతి భారతీయుడి హృదయాన్ని కలచి వేస్తోంది. సాటి సైనికులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులపై ఎప్పుడెప్పుడు ప్రతీకారం తీర్చుకుందామా అని ఇండియన్ ఆర్మీ ఎదురు చూస్తోంది. ప్రపంచ దేశాలు ఈ దాడిని ఖండించి, భారత్‌కు బాసటగా నిలిచాయి. ఉగ్రవాద దాడిలో వీరమరణం పొందిన సైనికుల్లో.. ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాథ.
ఈ దాడిలో వీరమరణం పొందిన రాజస్థాన్‌కు చెందిన రోహితేశ్ లాంబా అనే జవాన్ గురించి తెలుసుకుంటే హృదయం ద్రవించిపోతోంది. ఏడాది క్రితం రోహితేశ్‌కు పెళ్లి కాగా..2018డిసెంబర్లో అతడి భార్య పండంటి పాపకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆ పాప వయసు రెండు నెలలు. కానీ ఆ పసికందును రోహితేశ్ ఇప్పటి వరకూ చూడలేదు. తన చిట్టి తల్లిని చూడటం కోసం ఉద్యోగానికి సెలవు పెట్టి సొంతూరైన గోవిందపుర వెళ్దామనుకున్నాడు. కానీ ఈలోగానే పుల్వామా ఉగ్రదాడిలో రోహితేశ్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో వారి కుటుంబం కన్నీటి సముద్రంలా మారిపోయింది.
భర్త రాక కోసం ఎదురు చూస్తున్న రోహితేశ్ భార్య.. అతడి మరణవార్త విని కుప్పకూలిపోయింది. పసికందును చూసి కడివెడి కన్నీటితో తల్లడిల్లిపోతోంది. రోహితేశ్ మరణంతో గ్రామస్థులంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Also Read : పాక్ అంతుచూద్దాం : మోడీకి కాంగ్రెస్ మద్దతు
Also Read : చైనా వక్రబుద్ధి : పుల్వామా దాడిని ఖండిస్తూనే.. జైషే మహమద్ పై ప్రేమ
Also Read : విరాళం ఇవ్వాలంటే: వీరజవాన్ల కుటుంబాలను ఆదుకోండిలా