ఏరో ఇండియా-2019 : బెంగళూరు గగనతలంలో రాఫెల్ విన్యాసాలు

  • Published By: chvmurthy ,Published On : February 20, 2019 / 10:02 AM IST
ఏరో ఇండియా-2019 : బెంగళూరు గగనతలంలో రాఫెల్ విన్యాసాలు

బెంగళూరులోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ఏరో ఇండియా-2019 బుధవారం(ఫిబ్రవరి-20-2019) ఘనంగా ప్రారంభమైంది. మంగళవారం  వైమానిక ప్రదర్శన సన్నాహాల్లో సూర్య కిరణ్, జెట్ విమానం ఒకదానినొకటి ఢీకొన్న ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన  సూర్య కిరణ్ ఏరోబేటిక్ బృందానికి చెందిన వింగ్ కమాండర్ సాహిల్ గాంధీ మృతికి నివాళిగా రెండు నిమిషాలపాటు మౌనం వహించి ఈ కార్యక్రమం ప్రారంభించారు. కర్ణాటక సీఎం కుమారస్వామి, రక్షణమంత్రి నిర్మలాసీతారామన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

  కొన్ని రోజులుగా రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన రఫేల్ యుద్ధ విమానం గగనతలంలో విహరిస్తూ అందరినీ ఎట్రాక్ట్ చేసింది.సాహిల్ గాంధీ మృతికి నివాళిగా రఫేల్ సాధారణ వేగంతో ప్రదర్శన ఇచ్చింది.రఫేల్ తో పాటు తేజస్ కూడా ఈ ప్రదర్శనలో పాల్గొంది. లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ కు తేజస్ గా పేరు పెట్టిన దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయికి ఈ సందర్భంగా నివాళులర్పించారు. ఏరో ఇండియా-2019లో ప్రదర్శన ఇచ్చేందుకు ఫ్రాన్స్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన రెండు రఫేల్ యుద్ధ విమానాలు గత వారం భారత్ కి చేరుకొన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి-20-24 వరకు ఐదు రోజుల పాటు జరుగనున్న ఏరో ఇండియా-2019 ప్రదర్శనలో  మొత్తం 63 విమానాలు పాల్గొంటున్నాయి. ఈ ఏరో షోలో 51 దేశాలు పాల్గొంటున్నాయి.