INDIA: అందుకే మా కూటమికి ఇండియా అని పేరు పెట్టాం: రాహుల్, మమత
ఇది ఇండియాకు, ఎన్డీఏకు మధ్య జరుగుతున్న పోరు అని రాహుల్ గాంధీ అన్నారు.

Indian National Developmental Inclusive Alliance
INDIA – Rahul Gandhi : భారతదేశ భావజాలం, విలువలపై దాడి జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. దేశంలోని కోట్లాది మంది తమ గళాన్ని వినిపించకుండా చేస్తున్నారని అన్నారు. భారత గళం కోసమే తాము పోరాడుతున్నామని, అందుకే తమ కూటమికి ఇండియా (Indian National Developmental Inclusive Alliance) అని పేరు పెట్టామని తెలిపారు.
బెంగళూరులో ప్రతిపక్ష పార్టీల సమావేశం అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ… ఇది ఇండియాకు, ఎన్డీఏకు మధ్య జరుగుతున్న పోరు అని అన్నారు. అలాగే, నరేంద్ర మోదీకి, భారత్‌కు మధ్య జరుగుతున్న పోరాటమని చెప్పారు. తాము భారత రాజ్యాంగాన్ని, ప్రజల గళాన్ని, మహోన్నత భారతదేశ విలువలను కాపాడుతున్నామని తెలిపారు. గెలుపు తమదేనని చెప్పారు. బీజేపీ పాలనలో నిరుద్యోగం పెరిగిపోయిందని అన్నారు. ఎన్నో సమస్యలు తలెత్తాయని తెలిపారు. బీజేపీకి, దాని భావజాలానికి వ్యతిరేకంగా పోరాటం జరుగుతోందన్నారు.
ఇవాళ జరిగిన సమావేశం నిర్మాణాత్మకంగా, ఫలవంతంగా జరిగిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. తమ కూటమిని భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి(I.N.D.I.A)గా పిలుస్తామని చెప్పారు. ఇండియాను ఎన్డీఏ మార్చగలదా? అని ఆమె ప్రశ్నించారు.
ఈ తొమ్మిదేళ్లలో నరేంద్ర మోదీకి దేశం కోసం ఎన్నో చేయగలిగే అవకాశాలు వచ్చాయని, కానీ, ఆయన భారత్ ను అభివృద్ధి చేయకుండా అన్ని రంగాలను నాశనం చేశారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. ద్వేషం నుంచి దేశాన్ని కాపాడడానికే తాము సమావేశమయ్యామని, సొంత ప్రయోజనాల కోసం కాదని చెప్పుకొచ్చారు.
NDA Meet: ఎన్డీయే సమావేశం కోసం అశోక హోటల్ కు చేరుకున్న ప్రధాని మోదీ