ట్రంప్‌తో గౌతమ్ అదానీ గురించి మాట్లాడారా..? జర్నలిస్ట్ ప్రశ్నకు మోదీ ఏం చెప్పారో తెలుసా.. రాహుల్ గాంధీ ట్వీట్ వైరల్
ప్రధాని నరేంద్ర మోదీని ఓ జర్నలిస్ట్ భారతదేశానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కేసు గురించి ప్రశ్నించారు.

PM Modi
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య, దౌత్య సంబంధాలు, రక్షణ రంగంలో పరస్పర సహకారం వంటి అంశాలపై దేశాధినేతలు చర్చించుకున్నారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు కలిసి మీడియా సమావేశంలో సంయుక్తంగా పాల్గొన్నారు. జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీని ఓ జర్నలిస్ట్ భారతదేశానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ గురించి ప్రశ్నించారు.
Also Read: అమెరికా గడ్డపై ప్రధాని మోదీ సంచలన ప్రకటన.. అక్రమ వలసదారులను వెనక్కి తీసుకురావడంపై..
2024 నవంబర్ లో అమెరికాలో సౌరశక్తి కాంట్రాక్టులు పొందేందుకు సంబంధించి గౌతమ్ అదానీ సహా అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ డైరెక్టర్లపై కోట్ల రూపాయల లంచం ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై అమెరికన్ కోర్టులో విచారణ జరిగింది. గౌతమ్ అదానీ, అదానీ గ్రీన్ ఎనర్జీ అధికారులపై ఈ ఆరోపణలు వచ్చినప్పుడు అమెరికాలో జోబైడెన్ ప్రభుత్వం అధికారంలో ఉంది. లంచం ఆరోపణలను అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించింది. అయితే, తాజాగా.. ప్రధాని నరేంద్ర మోదీని ఈ అంశంపై మీడియా ప్రశ్నించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో గౌతమ్ అదానీ కేసు గురించి ఏమైనా చర్చించారా అంటూ ప్రశ్నించారు.
ప్రధాని మోదీ సమాధానం ఇస్తూ.. ‘‘భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం. మన సంస్కృతీ వసుధైక కుటుంబం. మేము మొత్తం ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా భావిస్తాం. ప్రతి భారతీయుడు నా వారని నేను నమ్ముతున్నాను. రెండు దేశాలకు చెందిన ఇద్దరు ప్రముఖ నాయకులు భేటీ అయినప్పుడు అలాంటి వ్యక్తిగత విషయాలను ఎప్పుడూ చర్చించరు’’ అంటూ మోదీ పేర్కొన్నారు.
ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘‘దేశంలో ప్రశ్నలు అడిగితే నిశ్శబ్దం.. విదేశాల్లో అడిగితే అది వ్యక్తిగత విషయం..! అమెరికాలో కూడా నరేంద్ర మోదీ అదానీ అవినీతిని కప్పిపుచ్చారు. స్నేహితుడి జేబు నింపడం మోదీకి ‘జాతి నిర్మాణం’ అయితే. లంచాలు తీసుకొని దేశ సంపదను దోచుకోవటం ‘వ్యక్తిగత విషయం’ అవుతుంది. అంటూ రాహుల్ విమర్శలు చేశారు.
देश में सवाल पूछो तो चुप्पी,
विदेश में पूछो तो निजी मामला!अमेरिका में भी मोदी जी ने अडानी जी के भ्रष्टाचार पर पर्दा डाल दिया!
जब मित्र का जेब भरना मोदी जी के लिए “राष्ट्र निर्माण” है, तब रिश्वतखोरी और देश की संपत्ति को लूटना “व्यक्तिगत मामला” बन जाता है।
— Rahul Gandhi (@RahulGandhi) February 14, 2025