Rahul Gandhi: వైట్‌ టీ షర్ట్ ఉద్యమాన్ని ప్రారంభించిన రాహుల్‌ గాంధీ

మోదీ ప్రభుత్వం పేదలు, శ్రామిక వర్గాలను పట్టించుకోవడం లేదని అన్నారు.

Rahul Gandhi: వైట్‌ టీ షర్ట్ ఉద్యమాన్ని ప్రారంభించిన రాహుల్‌ గాంధీ

Rahul Gandhi

Updated On : January 19, 2025 / 9:43 PM IST

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఇవాళ వైట్‌ టీ షర్ట్ ఉద్యమాన్ని ప్రారంభించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పేదలకు సాయం చేయడం లేదని, సామాన్య ప్రజల హక్కుల కోసం పోరాడడానికి ఈ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు రాహుల్ గాంధీ ఆదివారం ప్రకటించారు.

ఈ మేరకు ఓ వీడియోను కూడా తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఉద్యమంలో ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ప్రజలకు ఆర్థిక న్యాయంపై నమ్మకం ఉంటే, పెరుగుతున్న సంపద అసమానతలను వ్యతిరేకించాలని అన్నారు. సామాజిక సమానత్వం కోసం పోరాడాలని చెప్పారు. అన్ని రకాల వివక్షలను వ్యతిరేకించాలని తెలిపారు.

భారత్‌లో శాంతి, స్థిరత్వం కోసం పోరాడాలని కోరారు. తెల్ల టీ షర్టులు ధరించి ఉద్యమంలో పాల్గొనండని చెప్పారు. మోదీ ప్రభుత్వం పేదలు, శ్రామిక వర్గాలను పట్టించుకోవడం లేదని అన్నారు. వారిని వారి ఇష్టానికే వదిలేసిందని విమర్శించారు. కొంతమంది పెట్టుబడిదారులను మరింత సంపన్నం చేయడంపైనే ప్రభుత్వ దృష్టి ఉందని రాహుల్ గాంధీ చెప్పారు.

దీంతో దేశంలో అసమానతలు నిరంతరం పెరుగుతున్నాయని చెప్పారు. తమ రక్తం, చెమటతో దేశాన్ని పోషించే కార్మికుల పరిస్థితి మరింత అధ్వానంగా తయారైందని తెలిపారు. ఎన్నో రకాల అన్యాయాలు, దౌర్జన్యాలను రుచిచూడాల్సి వస్తోందని చెప్పారు.

ఇలాంటి పరిస్థితుల్లో వారికి న్యాయం చేయడానికి, హక్కుల కోసం గట్టిగా గళం విప్పడం మనందరి బాధ్యత అని అన్నారు. అందుకోసమే తాము వైట్‌ టీ షర్ట్ మూవ్‌మెంట్‌ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం https://whitetshirt. in/home/hin చూడాలని లేదంటే 9999812024 నంబర్‌కి మిస్డ్‌ కాల్‌ ఇవ్వాలని కోరారు.

Video clip: గోమూత్రంపై ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు వైరల్