Rahul Gandhi: అందుకే ఇండియా పేరును భారత్‌గా మార్చలేదు: రాహుల్ గాంధీ

ఇప్పుడెలా అని కేంద్ర సర్కారు భయపడిందని రాహుల్ చెప్పారు. చివరకు మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు.

Rahul Gandhi: అందుకే ఇండియా పేరును భారత్‌గా మార్చలేదు: రాహుల్ గాంధీ

Rahul Gandhi

Updated On : September 23, 2023 / 6:43 PM IST

Rahul Gandhi – Bharat: ఇండియా పేరును భారత్‌గా మార్చే అంశాన్ని బీజేపీ (BJP) ఎందుకు పక్కన పెట్టిందో చెప్పారు కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ. అలాగే, మహిళా రిజర్వేషన్లను (Women Reservation) ఇప్పుడే అమలు చేసే అవకాశం ఉన్నప్పటికీ బీజేపీ ఉద్దేశపూరితంగా ఏళ్లకు ఏళ్ల పాటు జాప్యం చేయాలనుకుంటోందని తెలిపారు.

ఇవాళ రాజస్థాన్ రాజధాని జైపూర్ లో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ‘మొదట కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదు. ఇండియా పేరును భారత్‌గా మార్చే అంశాన్ని చర్చించడానికి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

ప్రజలు ఈ అంశంపై విముఖత వ్యక్తం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గ్రహించింది. ఇప్పటికే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలపై ప్రకటన చేశామని, ఇప్పుడెలా అని కేంద్ర సర్కారు భయపడింది. దీంతో చివరకు మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లుకు మేము మద్దతు తెలిపాం. ఈ చట్టాన్ని అమలు చేయాలంటే జనగణన, నియోజక వర్గాల పునర్విభజన పూర్తి కావాల్సిందేనని బీజేపీ అంటోంది.

కానీ, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను ఇప్పటికిప్పుడు అమలు చేయవచ్చు. అయితే, బీజేపీ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోంది. 10 ఏళ్లపాటు అమలు చేయొద్దనుకుంటోంది. దాన్ని వెంటనే అమలు చేయాలని మేము అంటున్నాం. అలాగే, ఆ చట్టం ద్వారా ఓబీసీ మహిళలు కూడా లబ్ధి పొందాలి’ అని రాహుల్ గాంధీ అన్నారు.

Also Read: మా పార్టీ అధ్యక్షురాలు ఆధారాలతో చూపిస్తే తట్టుకోలేక మీరు ఇలా చేస్తున్నారు: సాధినేని యామిని