Red Fort: నేటి నుండి పంద్రాగస్టు వరకు ఎర్రకోట మూసివేత!

ఢిల్లీలోని ఎర్రకోటను పంద్రాగస్టు వరకు మూసివేస్తూ పురావస్తు శాఖ నిర్ణయం తీసుకుంది. సాధారణ ప్రజలకు, పర్యాటకులు సందర్శించేందుకు అనుమతిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలో డ్రోన్ల దాడి జరగొచ్చని నిఘావర్గాల హెచ్చరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Red Fort: నేటి నుండి పంద్రాగస్టు వరకు ఎర్రకోట మూసివేత!

Red Fort

Updated On : July 21, 2021 / 8:15 AM IST

Red Fort: ఢిల్లీలోని ఎర్రకోటను పంద్రాగస్టు వరకు మూసివేస్తూ పురావస్తు శాఖ నిర్ణయం తీసుకుంది. సాధారణ ప్రజలకు, పర్యాటకులు సందర్శించేందుకు అనుమతిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలో డ్రోన్ల దాడి జరగొచ్చని నిఘావర్గాల హెచ్చరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు వారం రోజుల ముందు ఎర్రకోటను మూసివేస్తారు. అయితే, ఈసారి నిఘా వర్గాల హెచ్చరికలు, ఢిల్లీ పోలీసుల సూచనలతో పురావస్తు శాఖ నేటి నుండి ఆగష్టు 15 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

డ్రోన్ల సాయంతో ఢిల్లీపై విరుచుకుపడేందుకు ఉగ్రవాదులు ప్రణాళికలు రచించినట్టు నిఘా సంస్థలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 15కి ముందే దాడి జరిగే అవకాశాలు ఉన్నాయని వివరించాయి. ఆగస్టు 5న ఢిల్లీలో భీకర దాడి జరిపేందుకు పాక్‌ ఉగ్రమూకలు కుట్ర పన్నుతున్నట్టు నిఘా వర్గాలు చెప్తున్నాయి. 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన నేపథ్యంలో అదే తేదీన ఢిల్లీలో దాడి జరిపేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని భద్రతా బలగాలు హెచ్చరించాయి.

దీంతో ఢిల్లీలో భద్రతా బలగాలు హై అలర్ట్‌ ప్రకటించాయి. మరోవైపు ఈమధ్య కాలంలో కశ్మీర్ సరిహద్దుల్లో గుర్తుతెలియని డ్రోన్ల సంచారం అధికమైంది. జమ్మూలోని ఎయిర్ ఫోర్స్ స్థావరం వద్ద డ్రోన్ దాడి తీవ్ర కలకలం రేపింది. దాంతో కేంద్రం సరిహద్దు ప్రాంతాల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలను మోహరించింది.