సీఏఏ హింసలో 20మంది మృతి…రెచ్చగొట్టే వ్యాఖ్యలు వద్దన్న ఢిల్లీ బీజేపీ చీఫ్

  • Published By: venkaiahnaidu ,Published On : February 26, 2020 / 05:39 AM IST
సీఏఏ హింసలో 20మంది మృతి…రెచ్చగొట్టే వ్యాఖ్యలు వద్దన్న ఢిల్లీ బీజేపీ చీఫ్

Updated On : February 26, 2020 / 5:39 AM IST

రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని బీజేపీ నాయకులకు ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ సూచించారు. దేశ రాజధానిలో శాంతిని నెలకొల్పడానికి మరియు గందరగోళానికి కారణమయ్యే, ప్రజలకు తప్పుడు సందేశం పంపే పని చేయకూడదని బీజేపీ నాయకులతో పాటుగా అన్ని పార్టీ నాయకులకు మనోజ్ తివారీ విజ్ణప్తి చేశారు. 

ఆదివారం(ఫిబ్రవరి-23,2020)ఈశాన్య ఢిల్లీలోని మౌజ్‌పూర్ చౌక్‌లో మొదటగా బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా పౌరసత్వసవరణ చట్టం (CAA)అనుకూల ర్యాలీకి నాయకత్వం వహించిన  రెచ్చగొట్టే ప్రసంగం చేశాడు. మిశ్రా చేసిన రెచ్చగొట్టే ప్రసంగంపై బీజేపీ అగ్రనాయకత్వం కూడా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. మిశ్రా స్పీచ్ ను అంగీకరించేది లేదంటూ బీజేపీ ఎంపీ గౌతమ్ అన్నారు.

మంగళవారం ఢిల్లీ కేంద్రహోంశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఆల్ పార్టీ మీటింగ్ లో పాల్గొన్న తివారీ….అన్ని పార్టీల నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని విజ్ణప్తి చేశారు. ఢిల్లీలో శాంతి నెలకొల్పేందుకు కృషి చేయాలని బీజేపీ నాయకులకు తివారీ సూచించారు. గందరగోళానికి కారణమయ్యే, ప్రజలకు తప్పుడు సందేశం పంపే పని చేయకూడదని పార్టీ నాయకులను ఆదేశించారు. ఉద్దేశ్యపూర్వకంగానే కొందరు సామాన్య ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని బీజేపీ ఓ ప్రకటనలో తెలిపింది.

సోమవారం ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ కుటుంబాన్ని మనోజ్ తివారీ,కేంద్రమంత్రి హర్షవర్థన్ పరామర్శించారు. రతన్ లాల్ మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పోలీసులపై,సామాన్య ప్రజలపై దాడులు తీవ్ర దురదృష్టకరమన్నారు. సీఏఏ హింసలో గాయపడి వివిధ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ పొందుతున్న వారిని కూడా తివారీ,హర్షవర్థన్ పరామర్శించారు.

ఈశాన్య ఢిల్లీలో ఆదివారం మధ్యాహ్నాం నుంచి సీఏఏ అనుకూల,వ్యతిరేక వర్గాల మధ్య కొనసాగుతున్న ఘర్షణల్లో ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 20కి చేరింది. ఇరు వర్గాలు రాళ్లు విసురుకుని,షాపులు, వాహనాలను తగులబెట్టేశారు. భారీగా ఆస్థినష్టం కూడా సంభవించింది. 150మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈశాన్య ఢిల్లీలో బుధవారం జాతీయ భద్రత సలహారు అజిత్ దోవల్ పర్యటించనున్నారు.