ప్రధాని మోడీ హెల్త్ టిప్స్: నా చర్మ సౌందర్యానికి అదే కారణం

విద్యార్ధులకు ప్రధాని మోడీ హెల్త్ టిప్స్ చెప్పారు. ‘బాగా కష్టపడి పనిచేయండి.. చెమటలు చిందించండి’ రోజుకు కనీసం నాలుగు సార్లు చెమట చిందేలా కష్టపడి పనిచేయాలని విద్యార్థులకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. పిల్లలు రోజుకు కనీసం నాలుగు సార్లయినా చెమటలు కారేలే పనిచేస్తే వారి ముఖం కాంతిమంతంగా ఉంటుందని చెప్పారు. అంతేకాదు బాగా నీళ్లు తాగాలని, పండ్ల రసాలు తీసుకోవాలని..మత్తుపానీయాలకు విద్యార్ధులు దూరంగా ఉండాలని సూచించారు.
శుక్రవారం (జనవరి 24,2020) ఢిల్లీలో ప్రధాని నివాసంలో మోడీ జాతీయ బాలల పురస్కారం కార్యక్రమం సందర్భంగా విజేతలుగా నిలిచిన విద్యార్థులతో మోదీ ఎంతో ఉత్సాహంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా తన ముఖం ఎప్పుడూ తరగని మెరుపుతో కాంతివంతంగా ఉండటం వెనుక రహస్యాన్ని ఆయన పిల్లలకు తెలిపారు.
ఈ వయస్సులో కూడా మీ ముఖంలో ఇంతటి తేజస్సు ఎలా వచ్చిందంటూ కొన్ని సంవత్సరాల క్రితం కొంతమంది విద్యార్ధులు తనను అడిగారని ఈ సందర్భంగా ప్రధాని విద్యార్ధులకు గుర్తు చేశారు. దీనికి తాను..ఎప్పుడూ కష్టపడి పనిచేస్తానని, ఎంతో చెమటోడు పనిచేస్తానని..ఆ చెమటే తన ముఖానికి మసాజ్‌గా పనిచేస్తుందని చెప్పానని మోదీ అన్నారు.
మీరు కూడా ఎప్పుడూ కష్టపడి పనిచేయండి..అని పిల్లలకు సూచించారు. కష్టపడితే దాని ఫలితం ఆరోగ్యం రూపంలోనే కాక అన్ని విధాలుగా పనిచేస్తుందనీ..ఆ కష్టమే బాలల భవిష్యత్తుకు మంచి పునాది వేస్తుందని మోదీ తెలిపారు. ఈసందర్భంగా వివిధ విభాగాల్లో జాతీయ పురస్కారాలను అందుకున్న విద్యార్థులను ఆయన అభినందించారు. ‘చిరు ప్రాయంలోనే మీరు ప్రదర్శించిన ధైర్య సాహసాలు అద్భుతమని కొనియాడారు. అవి నాలో గొప్ప స్ఫూర్తిని కలిగిస్తాయి. శక్తినీ ఇస్తాయని అన్నారు. కాగా వినూత్న ఆవిష్కరణలు, సామాజిక సేవలు, కళలు, క్రీడలు, సాహస కృత్యాలు, విద్యాసంబంధమైన అంశాల్లో ప్రతిభ కనబరిచిన ఐదేళ్ల నుంచి 18ఏళ్ల లోపు విద్యార్థులకు ఈ పురస్కారాలను అందజేశారు. విజేతలకు పతకంతో పాటు రూ.లక్ష నగదు చొప్పున అందజేశారు.
ఆధునిక భారతానికి బాటలు వేయండి
బాధ్యతలను సరిగా నిర్వర్తించడం ద్వారా ఆధునిక భారతానికి (న్యూ ఇండియా) యువత బాటలు పరచాలని ప్రధాని మోదీ అన్నారు.
-విద్యార్ధులకు వచ్చిన అవార్డులు ప్రధానం కాదు..అవి మీ జీవితంలో మరింతగా ముందుకు వెళ్లటానికి ప్రోత్సాహం.
– మీ వినూత్న ఆవిష్కరణలు, సామాజిక సేవలు, కళలు, క్రీడలు, సాహస కృత్యాలు, విద్యాసంబంధమైన అంశాల్లో ప్రతిభ నాకు ఎంతగా ఆనందాన్ని కలిగించాయి. మీరు నాకు స్పూర్తినిచ్చారు.
– మీ వయస్సులో మీరు సాధించిన విజయాలు సామాన్యమైనవి కాదు.అవి మీకు మరింతగా బలాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తాయి.
-మీపై మీకు ఉన్న నమ్మకం నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆ నమ్మకాన్ని మీరు ఎన్నటికీ విడిచిపెట్టవద్దు.
-కష్టాన్ని నమ్ముకోండి..ఆ కష్టమే మిమ్మల్ని ఎప్పటికీ గెలిపిస్తుంది.ఆ కష్టమే మీ ఆనందానికి..అందానికి..విజయానికి కారణమవుతుంది.
-క్లిష్ట పరిస్థితులతో పోరాడటానికి మీరు ధైర్యం చూపించారు.”నేను అలాంటి సాహసోపేతమైన ఘటన గురించి విన్నప్పుడల్లా ఎంతో స్పూర్తిపొందుతాను. మీలాంటి వారితో మాట్లాడితే నాకు ప్రేరణతో పాటు మరింత శక్తి వస్తుంది అంటూ విద్యార్ధులకు ప్రధాని మోడీ ప్రశంసించారు. ప్రోత్సహించారు.