షిర్డీ బంద్ : సాయిబాబా ఆలయం తెరిచే ఉంటుంది

మహారాష్ట్రలో సాయిబాబా జన్మస్థలంపై వివాదం ముదురుతోంది. పాథ్రీని బాబా జన్మస్థలంగా పేర్కొనడాన్ని వ్యతిరేకిస్తూ.. 2020, జనవరి 19వ తేదీ ఆదివారం బంద్ పాటించాలని షిర్డీ వాసులు పిలుపునిచ్చారు. కానీ..బాబా ఆలయం మాత్రం..తెరిచే ఉంటుందని, యదావిధిగా దర్శనాలు కొనసాగుతాయని సంస్థాన్ ట్రస్టు వెల్లడించింది. బంద్‌కు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రాధాకృష్ణ విఖే పాటిల్ మద్దతు ప్రకటించారు. పాథ్రీ కృతి సమితి కూడా ఆదివారం నుంచి పాథ్రీలో బంద్ పాటిస్తున్నట్లు ప్రకటించింది.
పర్భాణీ జిల్లా పాథ్రీలోని సాయి జన్మస్థానంలో వసతుల కల్పనకు రూ. 100 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇటీవలే ప్రకటించడంతో వివాదం తెరపైకి వచ్చింది. పాథ్రీ సాయి జన్మస్థలం అని చెప్పేందుకు ఆధారాలు లేవని షిర్డీ వాసులు చెబుతునన్నారు. వివాదాన్ని పరిష్కరించేందుకు సంబంధీకులందరితో సీఎం ఉద్ధవ్ త్వరలోనే సమావేశం కానున్నట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ కూడా తీవ్రంగా తప్పుబట్టింది. సాయిబాబా జన్మస్థలంపై ఇంతవరకు వివాదం లేదని… కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే సాయి జన్మస్థల వివాదం తెరపైకి వచ్చిందని ఆరోపించింది. బాబా జన్మభూమిని ఏ రాజకీయ నాయకుడు నిర్ధారించలేడని…. ఇలాంటి తరహా రాజకీయంకొనసాగితే షిర్డీ వాసులు న్యాయ పోరాటం చేస్తారని హెచ్చరించారు.
జన్మభూమి కన్నా కర్మభూమే గొప్పదంటున్నారు. అతి ముఖ్యమైన తీర్థ యాత్రల్లో షిర్డీ ఆలయం ఒకటి. భారత దేశంలో అత్యంత ప్రసిద్ధమైన ఆలయం. దేశ, విదేశాల నుంచి ఎంతో మంది భక్తులు ఇక్కడకు తరలివస్తుంటారు. తాజాగా షిర్డీ వాసులు ఇచ్చిన బంద్‌తో భక్తులు ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంది.
Read More : ఏపీ రాజధాని తేలేది రేపే