వాళ్లను చంపెయ్యాలి: జయా బచ్చన్ డిమాండ్.. పార్లమెంట్‌లో కన్నీరు పెట్టుకున్న ఎంపీలు

హైదరాబాద్ శివార్లలో వెటర్నరీ డాక్టర్ అత్యాచారం ఘటనపై పార్లమెంట్‌లో చర్చ చాలా గట్టిగా జరుగుతుంది. దిశ హత్యాచారం ఘటన కచ్చితంగా భద్రతా వైఫల్యమేంటూ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ, నటి జయా బచ్చన్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు పార్లమెంట్‌లో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె, ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వాలే కచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య ఘటనపై రాజ్యసభ చర్చలో భాగంగా జయా బచ్చన్ మాట్లాడుతూ.. ఈ కేసులోని నిందితులను ప్రజల్లోకి తీసుకుని వచ్చి వాళ్లకే అప్పగిస్తే చంపేస్తారని అన్నారు. అటువంటి అవసరం కూడా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇలాంటి నేరస్తులకు విదేశాల్లో ప్రజలే శిక్ష వేస్తారని ఆమె అన్నారు. ‘నిర్భయ, కథువా, హైదరాబాద్ వంటి ఘటనల్లో ప్రభుత్వాలు ఎలా విచారణ జరిపాయి. బాధితులకు ఏం న్యాయం చేశాయో ప్రజలకు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
దిశ ఘటనకు ముందు కూడా ఇలాంటి ఘటనలు జరిగినా అధికారులు ఏం చేస్తున్నారు అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులతో పాటు వైఫల్యం చెందిన అధికారుల పేర్లు బయటకు చెప్పి వాళ్ల పరువు తీయాలని అన్నారు. ఈ ఘటనతో అధికారుల పరువు పోయిందన్నారు. జయా బచ్చన్ అనంతరం, అన్నా డీఎంకే ఎంపీ విజిలా సత్యనాథ్ మాట్లాడుతూ, కన్నీరు పెట్టుకున్నారు. భారతావని మహిళలకు, చిన్నారులకు క్షేమకరంగా లేదని అన్నారు. ఎంతటి కఠిన నేరాలు చేసినా, నిందితులకు శిక్ష పడట్లేదని, వారిని జైళ్లలో పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. ఇదే సమయంలో దిశా ఘటనపై పలువురు ఎంపీలు కన్నీరు పట్టుకున్నారు.