Chennai beach: రాత్రివేళ చెన్నై బీచ్ లో అద్భుత దృశ్యాలు.. వెలుగులు విరజిమ్మిన అలలు.. వీడియో వైరల్
చెన్నై బీచ్ లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. పగలంతా అలల సవ్వడితో పర్యాటకులను అలరిస్తున్న బీచ్.. రాత్రి వేళ నీలివర్ణంతో కాంతులీనుతూ కనువిందు చేసింది.

Chennai beach’s stunning blue glow
Chennai Beach Stunning Blue Glow Goes Viral: చెన్నై బీచ్ లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. పగలంతా అలల సవ్వడితో పర్యాటకులను అలరిస్తున్న బీచ్.. రాత్రి వేళ నీలివర్ణంతో కాంతులీనుతూ కనువిందు చేసింది. బయోలుమినిసెంట్ తరంగాల కారణంగా అలలు పొంగులో కాంతి వెదజల్లుతూ పర్యాటకులను, స్థానికులను శంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. గత వారం రోజులుగా చెన్నైను భారీ వర్షాలు ముంచెత్తాయి. భారీ వర్షాల తరువాత చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్ బీచ్ లో రాత్రివేళ అలలు నీలి రంగులో స్థానికులను, పర్యాటకులను కనువిందు చేశాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజ్యసభ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి అన్బుమణి రామదాస్.. బీచ్ లో అద్భుతమైన నీలిరంగు అలలకు సంబంధించిన వీడియోలను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. నేను ఇప్పుడు ఈస్ట్ కోస్ట్ రోడ్ బీచ్ లో అద్భుతమైన ప్లోరోసెంట్ తరంగాలను ఆస్వాదించాను..అంటూ పేర్కొన్నారు.
Also Read: ఫస్ట్ అరెస్ట్ ఆయనదేనా..? దివాలీలోపు తెలంగాణలో ఏం జరగబోతోంది?
ఇలా ఎందుకు జరుగుతుంది..?
బీచ్ లో ఈ తరహా మార్పులు చూసేందుకు ఆహ్లాదకరంగా ఉన్నా ఒకింత స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. నేషనల్ ఓషన్ సర్వీస్ ప్రకారం.. ప్రధానంగా డైనో ప్లాగెల్లేట్స్ అని పిలువబడే మైక్రోస్కోపిక్ ప్లాంక్టన్ కారణం. అలల కదలికకు భంగం వాటిల్లినప్పుడు, ఇతర అవాంతరాల వల్ల.. ఈ చిన్నచిన్న సముద్ర జీవులు విడుదల చేసిన రసాయనాల కారణంగా ప్రకాశవంతమైన నీలం, ఆకుపచ్చ కాంతి విడుదలవుతుంది. దీంతో బయోలుమినిసెంట్ తరంగాలు ఏర్పడతాయి. జీవి, పర్యావరణం ఆధారంగా బయోలుమినిసెంట్ కాంతి మారవచ్చు. చెన్నై బీచ్ వంటి తీర ప్రాంత జలాల్లో ఇది తరచుగా వర్షపాతంతో సహా పర్యావరణ కారకాలతో ముడిపడి ఉంటుంది.
Also Read: Chandrababu Naidu : లోకేశ్ యువగళం పాదయాత్ర పై అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు కామెంట్స్
భారీ వర్షం ఒక కారణం కావచ్చా..?
బీచ్ లో అలలు నీలి వర్ణంలో కనువిందు చేసిన రోజు కంటే ముందు చెన్నైలో భారీ వర్షాలు కురిశాయి. ఈ భారీ వర్షాలు బయోలుమినిసెంట్ అలలకు కారణం కావచ్చునని కొందరు భావిస్తున్నారు. తీర ప్రాంత సముద్ర జలాల్లోకి పోషకాల ప్రవాహం, తక్కువ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల వల్ల నోక్టిలుకా సింటిల్లాన్స్ వంటి బయోలుమినిసెంట్ జీవుల రసాయనాలను విడుదల చేయటానికి అనువైన పరిస్థితులను సృష్టించవచ్చనని, ఈ కారణంగా సముద్రం అలలు నీలి వర్ణంలోకి మారి కనువిందు చేస్తుంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, నీలి రంగు వర్ణంలో అలలు ప్రమాదకరం కానప్పటికీ.. నీటిలో ఆక్సిజన్ స్థాయిలను తగ్గించగవని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది సముద్రంలో జీవులను ప్రభావితం చేస్తుంది. తీర ప్రాంతాల్లో కాలుష్యం పెరగడం కూడా ఇలాంటి ఘటనలకు తరచు కారణమవుతుందని పేర్కొంటున్నారు.
Just now enjoyed the mesmerising Fluorescent waves at ECR beach!! #Bioluminescence pic.twitter.com/6ljfmlpyRO
— Dr ANBUMANI RAMADOSS (@draramadoss) October 18, 2024