Supreme Court : మీరు నిప్పుతో ఆడుకుంటున్నారు; గవర్నర్లపై సుప్రీంకోర్టు ఫైర్

అసెంబ్లీలు ఆమోదించిన బిల్లుల అంశం కోర్టుల వద్దకు చేరక ముందే గవర్నర్లు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది అత్యున్నత న్యాయస్థానం.

Supreme Court : మీరు నిప్పుతో ఆడుకుంటున్నారు; గవర్నర్లపై సుప్రీంకోర్టు ఫైర్

supreme court raps punjab, tamil nadu governors over delay in bills

Updated On : November 11, 2023 / 10:29 AM IST

Supreme Court Of India: అసెంబ్లీలు అమోదించిన బిల్లుల విషయంలో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరుపై విస్మయం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. సమావేశాలు సక్రమంగా జరగలేదన్న కారణంతో బిల్లులు చెల్లవని పంజాబ్ గవర్నర్ చెప్పడాన్ని తప్పుపట్టిన న్యాయస్థానం.. మీరు నిప్పుతో ఆడుకుంటుంటున్నారంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి బిల్లుల విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయొద్దని ఈ సందర్భంగా తమిళనాడు, పంజాబ్ గవర్నర్లకు సూచించింది సుప్రీంకోర్టు.

తమిళనాడు, పంజాబ్ అసెంబ్లీలు పంపించిన బిల్లులను గవర్నర్లు ఆమోదించడం లేదని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో విచారణ జరిపిన ధర్మాసనం.. అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లుల విషయంలో ఆలస్యం చేయొద్దని గవర్నర్లకు సూచించించింది. ఇదే సమయంలో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టిన న్యాయస్థానం.. ఇది ఆందోళన కలిగించే అంశమని పేర్కొంది.

తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని సర్కార్‌కు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి మధ్య.. పంజాబ్‌లో ఆప్‌ ప్రభుత్వానికి గవర్నర్‌ పురోహిత్ మధ్య ఇటీవలి కాలంలో విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను పాస్‌ చేయడంలో గవర్నర్లు కావాలనే అలసత్వం ప్రదర్శిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి.

పంజాబ్‌, తమిళనాడు ప్రభుత్వాల తరపున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్ల మధ్య వివాదాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయని.. వీటిని వెంటనే పరిష్కరించాల్సిన అవసముందన్నారు. గవర్నర్ల ప్రవర్తన రాజ్యాంగ విరుద్ధంగా ఉందన్న ఆయన.. ఇలాంటి చర్యలు ప్రభుత్వ పాలనపై తీవ్రంగా ప్రభావం చూపిస్తాయని వాదించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

Also Read: దీపావళి సందర్భంగా క్రాకర్‌ టైమ్‌ ఇదే.. బాంబే హైకోర్టు సంచలన ఆదేశం

అసెంబ్లీ సమావేశాలు సక్రమంగా జరగలేదన్న కారణంతో బిల్లులు చెల్లవని పంజాబ్ గవర్నర్ చెప్పడం సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మీరు నిప్పుతో ఆడుకుంటున్నారన్న న్యాయస్థానం.. ఇలాంటి చర్యల వల్ల ప్రజాస్వామ్యాన్ని ఎలా కొనసాగిస్తామని ప్రశ్నించింది. ఇదే సమయంలో అసెంబ్లీని ప్రోరోగ్ చేయకుండా ఎందుకు వాయిదా వేశారని పంజాబ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. అసెంబ్లీలు ఆమోదించిన బిల్లుల అంశం కోర్టుల వద్దకు చేరక ముందే గవర్నర్లు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది అత్యున్నత న్యాయస్థానం.

Also Read: బ్యాంకులకు 6 రోజులపాటు సెలవులు.. వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు తేదీల్లో పండుగ హాలీడేస్

ఈ నేపథ్యంలోనే పంజాబ్ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ పురోహిత్ తీసుకున్న చర్యల వివరాలను కోర్టుకు సమర్పించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సుప్రీం కోర్టు ఆదేశించింది. అనంతరం కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది.