Taj Mahal : తాజ్‌ మహల్‌ లోని ఆ 22 గదులు తెరవాలని పిల్‌.. పిటిషనర్‌కు షాకిచ్చిన కోర్టు

తాజ్‌ మహల్‌లో మూసిఉన్న 22 తలుపులను తెరువాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై అలహాబాద్‌ హైకోర్టు లక్నో బెంచ్‌ విచారణ జరిపింది. పిటిషన్‌ను జస్టిస్‌ దేవేంద్రకుమార్‌ ఉపాధ్యాయ్‌, జస్టిస్‌ సుభాష్ విద్యార్థి ధర్మాసనం కొట్టి వేసింది.

Taj Mahal :  తాజ్‌ మహల్‌ లోని ఆ 22 గదులు తెరవాలని పిల్‌.. పిటిషనర్‌కు షాకిచ్చిన కోర్టు

Taj Mahal Mystery

Updated On : May 12, 2022 / 5:31 PM IST

Taj Mahal Mystery : తాజ్‌ మహల్‌. ధవళ వర్ణంతో మెరిసిపోయే ఆ అందమైన అద్భుతమైన కట్టడం వెనుక అంతులేని మిస్టరీలెన్నో! ప్రేమకు చిహ్నంగా నిలిచిన నిర్మాణం వెనుక అంతపట్టని రహస్యాలెన్నో! తాజ్‌మహల్‌ తనలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలను దాచుకుంది. తాజ్‌మహల్‌లోని మూసి ఉన్న 22 గదుల్లో హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయా… లేదంటే మరేవైనా ఉన్నాయా… అన్నది తెలియకపోయినా… బయట ప్రపంచం చూడని కొన్ని రహస్యాలను మాత్రం అక్కడ సమాధి చేశారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలియాలంటే.. ఆ గదులను తెరిచి చూడాల్సిందేననే వాదనలు వినిపిస్తున్నాయి…! దీనికి సంబంధించి అలహాబాద్‌ హైకోర్టులో పిటీషన్ కూడా దాఖలు అయ్యింది.

తాజ్‌ మహల్‌లో మూసిఉన్న 22 తలుపులను తెరువాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై అలహాబాద్‌ హైకోర్టు లక్నో బెంచ్‌ గురువారం (మే12,2022) విచారణ జరిపింది. పిటిషన్‌ను జస్టిస్‌ దేవేంద్రకుమార్‌ ఉపాధ్యాయ్‌, జస్టిస్‌ సుభాష్ విద్యార్థి ధర్మాసనం కొట్టి వేసింది. ఎటువంటి పరిశోధన చేయకుండా పిటిషన్‌ ఎలా వేస్తారు? అంటూ కోర్టు ప్రశ్నించింది. అయోధ్యకు చెందిన డాక్టర్ రజనీష్ సింగ్ ఈ పిటిషన్‌ను ఇటీవల దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషన్‌లో చరిత్రకారుడు పీఎన్‌ ఓక్‌ రాసిన తాజ్‌ మహల్‌ పుస్తకాన్ని ఉటంకిస్తూ తాజ్‌ మహల్‌ వాస్తవానికి తేజో మహాలయ అనీ, దీన్ని క్రీస్తు శకం 1212లో రాజు పర్మర్ది దేవ్‌ నిర్మించారని పిటిషన్లో పేర్కొన్నారు. తాజ్‌మహల్‌పై తప్పుడు చరిత్ర బోధిస్తున్నారని, అందుకే నిజానిజాలు తెలుసుకునేందుకు తలుపులు తెరవాలని పిటిషనర్‌ కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ..ఇటువంటి నిరాధారమై వాదోపవాదాలు డ్రాయింగ్ రూం కోసమేనని న్యాయస్థానం కోసం కాదని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది.

Also read : Tajmahal Secrets : తాజ్‌మహల్‌ స్థానంలో..తేజో మహాలయ ఉండేదా? ఆ 22 గదుల్లో ఉన్న రహస్యం ఏంటీ?!

తాజ్‌ మహల్‌లో మూసివేసిన తలుపుల లోపల శివుడి ఆలయం ఉందని పిటిషన్‌లో తెలిపారు. తాజ్‌మహల్‌కు సంబంధించి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేసి తాజ్‌మహల్‌లోని దాదాపు 22 మూసి ఉన్న తలుపులను తెరిచేలా అధ్యయనం చేసి ఆదేశాలు జారీ చేయాలని, దీంతో నిజానిజాలు వెలుగులోకి వస్తాయని పిటిషన్‌ పేర్కొన్నారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది మాట్లాడుతూ తాజ్‌ మహల్‌ గురించి దేశ పౌరులు నిజానిజాలు తెసుకోవాల్సిన అవసరం ఉంది అని వాదించారు. పిటిషన్‌ మాట్లాడుతూ ఈ విషయంపై పలు సార్లు ఆర్టీఐ కింద దాఖలు చేశానని..భద్రతా కారణాల దృష్ట్యా తెరవటంలేదని అధికారులు తెలిపారని కోర్టుకు తెలిపారు.

ఈ పిటీషన్ పై యూపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది స్పందిస్తూ.. ఈ కేసులో ఇప్పటికే ఆగ్రాలో కేసు నమోదైందని..దీనిపై పిటిషనర్‌కు ఎటువంటి అధికార పరిధి లేదని అన్నారు. తాజ్‌ మహల్‌ శివుడికి, అల్లాకు సంబంధించిందనే విషయంపై మాట్లాడడం లేదని, మూసి ఉన్న గదుల వెనుక ఏముందో మనందరం తెలుసుకోవాల్సి ఉందన్నారు. ఈ మేరకు వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్‌ను మందలించింది. తాజ్‌మహల్‌పై పూర్తి స్థాయి పరిశోధన చేసిన తర్వాతే.. పిల్ వేయాలని పిటిషనర్‌ని ధర్మాసనం మందలిచింది. పిల్‌ను ఎగతాళి చేయవద్దని.. కనీస అవగాహన కూడా లేకుండా.. ఇష్టమొచ్చినట్లుగా పిల్ వేస్తారా? అంటూ ధర్మాసనం కాస్త ఆగ్రహం వ్యక్తంచేసింది.

Also read : Tajmahal Secrets : తాజ్ మహల్ మిస్టరీ వీడేనా? ఆ 22 గదులు తెరవటానికి కోర్టు గ్రీన్ సిగ్నల్‌ ఇస్తుందా?

ముందు తాజ్‌మహల్‌ను ఎవరు నిర్మించారు? ఎప్పుడు కట్టారన్న వివరాలు తెలుసుకోవాలంటూ పిటిషన్‌కు కోర్టు సూచించింది. అనంతర ఆపిల్ ను కొట్టివేసింది. పరిశోధన చేయకుండా ఎవరైనా అడ్డుకుంటే మళ్లీ ధర్మాసనాన్ని ఆశ్రయించాలని సూచించింది.

కాగా..తాజ్ మహల్‌ను మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ సమాధిగా నిర్మించాడు అని చరిత్ర చెబుతోంది.. పాలరాతి స్మారక కట్టడం 1632లో ప్రారంభమైంది చివరకు 1653లో పూర్తి చేయడానికి 22 సంవత్సరాలు పట్టింది. అది ఇంత గొప్ప కట్టడం కాబట్టే 1982లో UNESCO వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది.