తమిళనాడులో భారీ వర్షాలు : 20 జిల్లాలకు ముప్పు..స్కూళ్లకు సెలవులు

  • Published By: madhu ,Published On : October 30, 2019 / 01:26 PM IST
తమిళనాడులో భారీ వర్షాలు : 20 జిల్లాలకు ముప్పు..స్కూళ్లకు సెలవులు

Updated On : October 30, 2019 / 1:26 PM IST

మరోసారి భారీ వర్షాలు తమిళనాడును అతలాకుతలం చేస్తున్నాయి. కుంభవృష్టితో కురుస్తున్న వానలతో జనజీవనం స్తంభించిపోయింది. రహదారులపై భారీగా నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు విఘాతం కలుగుతోంది. బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. భారీ వర్షాలతో పాటు..గాలులు వీస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధానంగా చెన్నైలో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి.

తాజాగా 20 జిల్లాలకు ముప్పు ఉందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఉద్యోగులు, కార్యాలయాలకు, ఇతర పనులపై వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని రీజనల్ మెట్రోలాజికల్ సెంటర్ (RMC) హెచ్చరించింది. ఎనిమిది జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మధురై, విరుధునగర్, రామంతాపురం, నెల్లాయి, వెల్లూరు, తెని, శివగంగాయి, తూతుకుడి ప్రాంతాల్లో బుధవారం స్కూళ్లు తెరుచుకోవని వెల్లడించింది. 

రాష్ట్రంలోని రామనాథపురంతో పాటు పలు జిల్లాల్లో మునుపటికంటే అత్యధికంగా వర్షపాతం నమోదవుతోందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అక్టోబర్ 27వ తేదీ ఆదివారం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి కన్నాకుమారి వైపు కదులుతోంది. ఈశాన్య అరేబియా సముద్రం, లక్ష ద్వీప్, మాల్దీవులు వైపుగా వెళ్లి తుపాన్‌గా మారే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. ఇందులో భాగంగానే బుధ, గురువారాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు ప్రకటించారు. 

రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. చెట్ల కింద, విద్యుత స్తంబాల కింద నిల్చోవద్దన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అక్టోబర్ నెల రోజుల్లో 196 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు అంచనా వేశారు. రాష్ట్రంలో సగటున 36 మి.మీ వర్షపాతం నమోదైందన్నారు. తిరవల్లూరులో గరిష్టంగా 72 మి.మీటర్ల వర్షపాతం నమోదైందని, ఆర్కేపేట్‌లో అక్టోబర్ 29వ తేదీ మంగళవారం 190 మి.మీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. 

Read More : మహా రాజకీయం : శివసేనకు బీజేపీ ఆఫర్