దారుణం.. గర్భిణీపై పైశాచికులు లైంగికదాడి చేసి.. రైల్లోంచి తోసేశారు..

రైలులో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతోంది.

దారుణం.. గర్భిణీపై పైశాచికులు లైంగికదాడి చేసి.. రైల్లోంచి తోసేశారు..

Updated On : February 7, 2025 / 3:05 PM IST

రైలులో కామాంధుల దాడిలో గాయపడ్డ ఓ గర్భిణీ వ్యధ గురించి తెలుసుకుంటే “రాబందుల రాజ్యంలో.. రాకాసుల మూకల్లో.. ఎలా బతకగలవమ్మా?” అన్న సినిమా పాట గుర్తుకు వస్తుంది. ఓ గర్భిణీపై ఇద్దరు మృగాళ్లు లైంగిక దాడి చేసి రైలులో నుంచి తోసేశారు. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

ఓ గర్భిణీ కోయంబత్తూరు నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి వెళ్లే రైలులో ప్రయాణిస్తోంది. ఆమె మహిళల బోగీలోనే ఉన్నప్పటికీ అందులోకి జోలార్ పెట్టై రైల్వేస్టేషన్‌ వద్ద ఇద్దరు వ్యక్తులు ఎక్కారు.

దీంతో మహిళల బోగీలోకి వారు ఎందుకు ఎక్కారంటూ గర్భిణీ నిలదీసింది. ఆమెతో వారిద్దరు గొడవపడ్డారు. గర్భిణీపై వారిద్దరు దాడి చేశారు. ఆ తర్వత ఆ మహిళ వాష్‌రూమ్‌కు వెళ్తుండగా ఆమె వెనకే వారువెళ్లి విసిగించారు.

Sailajanath: షర్మిలకు బిగ్‌ షాక్‌.. జగన్ చెంతకు మాజీ మంత్రి శైలజానాథ్

అక్కడితో ఊరుకోకుండా మహిళల బోగీలోని డోర్‌ వద్ద ఆమె మళ్లీ గొడవపడి లైంగిక వేధింపులకు దిగారు. ఆమె కేకలు వేసింది. దీంతో ఆమెను ఆ ఇద్దరు నిందితులు రైలు నుంచి బయటకు తోసేశారు. కేవీ కుప్పం స్టేషన్ వద్ద ఆమె పడిపోయింది.

తోటి ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆమెను అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. బాధితురాలికైన గాయాలకు డాక్టర్లు చికిత్స అందించారు. ఆమె గర్భిణీ కావడంతో కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండాలని డాక్టర్లు చెప్పారు.

వేధింపుల ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులలో ఒకడైన హేమరాజ్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడికి గతంలోనూ ఇటువంటి నేరాలకు పాల్పడిన చరిత్ర ఉందని చెప్పారు. అతడు కాట్పాడి రైల్వే పోలీసుల అదుపులో ఉన్నాడు.

ఈ కేసులో మరిన్ని ఆధారాల కోసం సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గర్భిణీపై దాడికి పాల్పడ్డ వారిపై హత్యాయత్నంతో పాటు లైంగిక వేధింపుల కేసులు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు.

గర్భిణీపై దాడి ఘటనపై అన్నాడీఎంకే స్పందించింది. డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి మాట్లాడుతూ.. తమిళనాడులోని మహిళలు కనీసం రహదారిపై సురక్షితంగా నడవలేకపోతున్నారని విమర్శించారు.