Indian Railways: మీకు తత్కాల్ టికెట్లు దొరక్కపోవడానికి ఇదే కారణం.. పెద్ద స్కాం బయటపడింది..

తత్కాల్ టికెట్లు నిమిషాల్లో బుక్ అవుతుండటంపై ఐఆర్సీటీసీ దర్యాప్తు చేపట్టింది. ఏజెంట్లు బాట్‌లు బుకింగ్ వ్యవస్థను పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తున్నట్లు వెల్లడైంది.

Indian Railways: మీకు తత్కాల్ టికెట్లు దొరక్కపోవడానికి ఇదే కారణం.. పెద్ద స్కాం బయటపడింది..

Updated On : June 5, 2025 / 12:31 PM IST

Indian Railways: దూర ప్రాంతాలకు, సౌకర్యవంతమైన ప్రయాణం చేయాలంటే సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా రైళ్లలో ప్రయాణం చేసేందుకు మొగ్గుచూపుతుంటారు. నిత్యం లక్షలాది మంది రైలు ప్రయాణాలు చేస్తుంటారు. రైలు ప్రయాణాలు చేయాలంటే ముందుగా టికెట్లు బుక్ చేసుకోవాలి. కానీ, కొన్నిసార్లు అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అలాంటి సమయంలో తత్కాల్ టికెట్ అందుబాటులో ఉంటుంది. అయితే, ఈ తత్కాల్ టికెట్లు దొరకడం అంత సులభం కాదు. వెయిటింగ్ లిస్ట్ చాంతాడంత ఉంటుంది.

 

ప్రయాణానికి ఒకరోజు ముందు తత్కాల్ కోటా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. దీంతో చాలా మంది తత్కాల్ టికెట్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయా అంటూ ఎదురు చూస్తుంటారు. తీరా బుకింగ్ ఓపెన్ అయిన తరువాత కేవలం నిమిషాల్లోనే టికెట్లు బుక్ అయిపోతుంటాయి. దీంతో చాలామంది తాత్కాల్ టికెట్ల కోసం అదనపు సొమ్ము చెల్లించి ఏజెంట్లపై ఆధారపడాల్సి వస్తుంది. అయితే, వీటి బుకింగ్ వెనుక పెద్ద స్కామే ఉందని తేలింది. ఆ స్కాంను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) గుర్తించి.. నకిలీ ఐడీలను డీయాక్టివేట్ చేసింది.

 

రైల్వే ఉన్నతాధికారుల ప్రకారం.. తత్కాల్ టికెట్లు నిమిషాల్లో బుక్ అవుతుండటంపై దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తులో ఏజెంట్లు, బాట్‌లు బుకింగ్ వ్యవస్థను పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తున్నట్లు వెల్లడైంది. ఐఆర్సీటీసీ తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ లో మోసాన్ని అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. ఈ ప్రక్రియలో భాగంగా జనవరి నెల నుంచి మే 2025 మధ్య 2.9 లక్షల అనుమానాస్పద పీఎన్ఆర్ (Passenger Name Record)లను గుర్తించింది. 2.5 కోట్ల యూజర్ ఐడీలను డీయాక్టివేట్ చేసింది. మరో 20లక్షల ఐడీలపై నిఘా పెట్టింది. బుకింగ్ నిబంధనలను అతిక్రమించి నకిలీ యూజర్ ఐడీలను సృష్టించడానికి ఉపయోగించే 6,800 కంటే ఎక్కువ డిస్పోజబుల్ ఇమెయిల్ డొమైన్‌లను బ్లాక్ చేసింది. ఈ సమస్యను చట్టబద్దంగా పరిష్కరించడానికి ఐఆర్సీటీసీ నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ లో 134 ఫిర్యాదులను దాఖలు చేసింది.

 

నకిలీ దారుల వల్ల బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైన సెకన్లు, నిమిషాల్లోనే టికెట్లు బుక్ అవుతున్నాయి. తత్కాల్ వ్యవస్థ దుర్వినియోగం వల్ల అసలైన ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది. ఒక పోల్ ప్రకారం.. మొదటి నిమిషంలోనే 73శాతం మంది వినియోగదారులు వెయిట్ లిస్ట్ లో ఉన్నారు. దీని వల్ల వారిలో చాలా మంది టికెట్లు ధ్రువీకరణ కాకపోవటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఏజెంట్లపై ఆధారపడాల్సి వస్తుంది. తాజా పరిణామాలతో టికెట్ బుకింగ్‌లో అత్యంత సవాలుతో కూడిన ప్రక్రియ అయిన తత్కాల్ టికెట్ బుకింగ్ ను ఇప్పుడు రైల్వేశాఖ మరింత సులభతరం చేసింది.

 

రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతినిధి దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. రైల్వేలు తమ టికెట్ బుకింగ్ వ్యవస్థను పూర్తిగా డిజిటల్ గా ఆధునీకరించాయని, ఇప్పుడు వెబ్ సైట్ లో ఏఐ ఆధారిత యాంటీ-బాట్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తద్వారా నకిలీ, ఆటోమేటిక్ బుకింగ్ లు చేసే బాట్ లను తక్షణమే గుర్తించి బ్లాక్ చేస్తుందని తెలిపారు.