బీహార్ లో ఓడింది మహాకూటమే.. తేజస్వీ కాదు!

Tejashwi Yadav’s Party Single Largest In Bihar బీహార్ ఎన్నికల్లో మహాకూటమి గెలవకపోయినప్పటికీ…ఎన్నికల సమరంలో తేజస్వీ ముద్ర స్పష్టంగా కనపడింది. బీహార్ రాజకీయాల్లో చక్రం తిప్పే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ లేకున్నా ఆ పార్టీ చెప్పుకోదగ్గ స్థాయిలో స్థానాలు గెలవగలిగిందంటే దానికి ప్రధాన కారణం తేజస్వీనే. లాలూ గైర్హాజరుతో ఆర్జేడీని తేజస్వీ నడిపించిన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మోడీ మాటల తూటాలను, నితీశ్ విమర్శనాస్త్రాలను ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూ తేజస్వీ ముందుకు సాగిన తీరు అనేకమంది మన్ననలు పొందింది.
విపక్ష పార్టీల కూటమి మహాఘట్ బంధన్ చివరి వరకు ఎన్డీయేకి గట్టి పోటీనే ఇచ్చింది. ముఖ్యంగా తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ..ఎన్డీఏతో హోరాహోరీగా తలపడింది. ఓటమికి అడుగు దూరంలో నిలిచినప్పటికీ…ఎన్నికల సమరంలో తేజస్వీ ముద్ర స్పష్టంగా కనబడింది.
బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్.. అన్నీ తానై ప్రచార బాధ్యతలు తనపై వేసుకొని మహాగట్ బంధన్‌ను ముందుండి నడిపించారు. తండ్రి లాలూ ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో లేని లోటును భర్తీ చేసేందుకు ఈ యువ నేత శక్తి వంచన లేకుండా కృషి చేశారు. రాజకీయాల్లో తలపండిన ఎన్డీఏ దిగ్గజ నేతలు ఓవైపు.. వాళ్ల అనుభవమంత వయసు కూడా లేని 31ఏళ్ల యువనేత తేజస్వీ మరోవైపుగా ఎన్నికల సమరం జరిగింది.
2020 బిహార్ శాసనసభ ఎన్నికల సమరం తేజస్వీ చుట్టూనే తిరిగింది. మోడీ నుంచి నితీశ్ వరకు ఎన్డీఏ నేతలందరూ తేజస్వీ పేరు లేకుండా ప్రసంగాన్ని పూర్తి చేయలేదు. తేజస్వీపై వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. ఎప్పుడూ వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లని నితీశ్ సైతం ఈసారి సహనం కోల్పోయారు. తేజస్వీ యాదవ్ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. విమర్శలను దీటుగా ఎదుర్కొన్నారు. రోజుకు రికార్డు స్థాయిలో ప్రచార సభలకు హాజరయ్యారు. యువకులను ఆకర్షించే వాగ్దానాలు ఇచ్చారు. సొంత పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేస్తూనే రాహుల్ గాంధీతో కాంగ్రెస్ ప్రచార సభల్లోనూ పాల్గొన్నారు. కానీ హస్తం పార్టీ అగ్రనాయకత్వం నుంచి తేజస్వీకి కావాల్సిన సహకారం లభించలేదు. దీంతో ఒంటరిగానే పోరు సాగించాల్సి వచ్చింది. ఈ ఎన్నికలు కలిసిరాకపోయినా.. రానున్న రోజుల్లో తేజస్వీ ఓ అసాధారణ నేతగా ఎదిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 125స్థానాల్లో విజయం సాధించగా,మహాకూటమి110 స్థానాల్లో విజయం సాధించింది. ఇక,ఎన్డీయే నుంచి వైదొలిగి సొంతంగా పోటీచేసిన ఎల్జేపీ ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. ఇతరులు 7చోట్ల విజయం సాధించారు.ఇక పార్టీల విషయానికొస్తే రాష్ట్రంలోయ ఎక్కువస్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ అవతరించింది. ఇక ఓట్ల శాతం విషయానికొస్తే,ఎన్డీయే కూటమికి 38.4శాతం ఓట్లు రాగా,మహాకూటమికి 37.3శాతం ఓట్లు వచ్చాయి. ఎల్జేపీకి 5.6శాతం ఓట్లు,ఇతరులకు 18.7శాతం ఓట్లు వచ్చాయి.