Iron Deficiency: మీలో ఐరన్ లోపం ఉంటే ప్రమాదమే.. ఉందో లేదో ఈ లక్షణాల ద్వారా తెలుసుకోండి..
శరీరంలో తగినంత ఐరన్ లేకపోతే, శరీరం కణాలకు తగినంత ఆక్సిజన్‌ను సరఫరా చేయదని, తగినంత శక్తిని ఉత్పత్తి చేయలేదని..

శరీరానికి కావాల్సిన మినరల్స్, విటమిన్స్ తగినంత లేకపోతే అనేక ఆరోగ్య సమస్యల బారిన పడతాం. చాలా మందిలో ఐరన్ లోపం ఉంటుంది. శరీరానికి ఐరన్ ఎంతో ముఖ్యం. ఇది శరీరంలో చాలా ముఖ్యమైన ఖనిజం. ఇటీవల అమెరికాలో చేసిన పరిశోధనల్లో పలు కీలక విషయాలు తెలిశాయి.
ప్రతి ముగ్గురు అమెరికన్‌లలో ఒకరు ఐరన్ లోపం వల్ల బాధపడుతున్నారని తేలింది. ఐరన్ ప్రాధాన్యం, దాని లోపం వల్ల తలెత్తే సమస్యలు ఏంటో తెలుసుకుందాం. ఐరన్ లోపం ఉన్నవారిలో హెమోగ్లోబిన్ తగ్గి, రక్తహీనత (అనీమియా) వస్తుంది. అలసట, నీరసం ఆవహిస్తాయి. జుట్టు మెరుపును కోల్పోయినట్లుగా మారుతుంది.
పదే పదే అలసిపోయినట్లు, చిరాకుగా అనిపిస్తుంది. శరీరంలోని భాగాలకు ఐరన్ ఆక్సిజన్‌ను తీసుకువెళ్లే ప్రక్రియలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. జుట్టు, చర్మం, గోర్లు ఆరోగ్యంగా ఉండేలా చూడడంలో ఐరన్ తోడ్పడుతుంది.
తగినంత ఐరన్ లేకపోతే?
తాజాగా, లిక్విడ్ ఐరన్ సప్లిమెంట్ బ్రాండ్ బ్లూఐరన్ న్యూట్రిషనిస్ట్ కారా షా పలు వివరాలు తెలిపారు. శరీర పనీతీరు సక్రమంగా జరగడానికి ఐరన్ ఎందుకు అంత ముఖ్యమో వివరించారు. హిమోగ్లోబిన్ ఉత్పత్తికి ఐరన్ చాలా ముఖ్యమైనదని అన్నారు. హిమోగ్లోబిన్ శరీరంలో ఆక్సిజన్‌ను సరఫరా చేయడానికి సహాయపడే ప్రోటీన్ అని తెలిపారు. శరీరంలో శక్తి ఉత్పత్తిలో అది ఓ ముఖ్యమైన భాగమని చెప్పారు. శరీరంలో తగినంత ఐరన్ లేకపోతే, శరీరం కణాలకు తగినంత ఆక్సిజన్‌ను సరఫరా చేయదని, తగినంత శక్తిని ఉత్పత్తి చేయలేదని అన్నారు.
దీంతో అలసట, బలహీనత, పాలిపోయిన చర్మం, ఊపిరి ఆడకపోవడం, గోర్లు పెళుసుగా మారడం, జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయని అన్నారు. అంతేగాక, అలసట, ఏకాగ్రత లేకపోవడం, మెమరీ సమస్యలు, వ్యాయామం చేసే సామర్థ్యం తగ్గడం, శరీరంలో కట్స్ (కోతలు) ఏర్పడితే అవి నయం కావడానికి చాలా సమయం పట్టడం, గొంతు, నాలుకలో పుండ్లు వంటి లక్షణాలు కూడా కనపడతాయని తెలిపారు.
రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ (రాత్రి సమయంలో కాళ్లను పదే పదే కదుపుతుండడం) వంటి సమస్యతోనూ బాధపడతారని అన్నారు. ఐరన్ లోపానికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పారు. ఐబుప్రోఫెన్, ఆస్పిరిన్ వంటి మందులు తీసుకోవడం, కడుపులో అల్సర్లు, పేగులలో మంట, పైల్స్ వంటివి కూడా ఐరన్ లోపానికి దారి తీస్తాయని నిపుణులు వివరించారు. గర్భధారణ సమయంలో ఐరన్ లోపం సాధారణంగానే వస్తుందని చెప్పారు.
ఇవి తినాలి..
శరీరంలో ఐరన్ లోపం ఉంటే దాన్ని ఎదుర్కోవడానికి ఆకు కూరలు, మాంసాన్ని ఎక్కువగా తినాలి. వాటర్‌క్రెస్, కర్లీ కాలే వంటి ముదురు ఆకుపచ్చ ఆకు కూరలు, తృణధాన్యాలు తీసుకోవాలి. ప్రూనే , ఎండుద్రాక్ష వంటి ఎండిన పండ్లు.. బీన్స్, బఠానీలు, కాయధాన్యాలను ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి. టీ, కాఫీలు తక్కువగా తాగాలి. వైద్యుల సలహాతో ఐరన్ సప్లిమెంట్లనూ తీసుకోవచ్చు.
అమెరికాలోని టీనేజర్లలో ఈ ఇంజెక్షన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయిన వైనం