Bypoll Results: గుజరాత్‌లో బీజేపీని ఓడించిన ఆప్.. 4 రాష్ట్రాల్లో 5 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల ఫలితాలు ఇలా..

పంజాబ్ లోని లూథియానా స్థానంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి సంజీవ్‌ అరోరా గెలుపొందారు. గుజరాత్‌లోని విసావదార్‌ అసెంబ్లీ స్థానంలో బీజేపీని ఓడించింది ఆప్.

Bypoll Results: గుజరాత్‌లో బీజేపీని ఓడించిన ఆప్.. 4 రాష్ట్రాల్లో 5 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల ఫలితాలు ఇలా..

Updated On : June 23, 2025 / 6:19 PM IST

Bypoll Results: దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో 5 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. గుజరాత్, పంజాబ్, కేరళ, వెస్ట్ బెంగాల్ లోని అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. బీజేపీ, టీఎంసీ, కాంగ్రెస్ చెరో స్థానంలో గెలిచాయి. గుజరాత్, పంజాబ్ లో ఆప్ సత్తా చాటింది. రెండు చోట్ల గెలుపొందింది.

గుజరాత్ లోని విసావాదర్, కడి స్థానాలకు జరిగిన ఉపఎన్నికలో బీజేపీ, ఆప్ చెరొక స్థానంలో గెలుపొందాయి. విసావాదర్ లో ఆప్ అభ్యర్థి గోపాల్ ఇటాలియా బీజేపీ అభ్యర్థి కిరీట్ పటేల్ పై 17 వేల 554 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ప్రధాని మోదీ ఇలాఖాలో విజయం ఆప్ పార్టీలో కొత్త జోష్ ని నింపింది.

పంజాబ్ లోని లూథియానా స్థానంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి సంజీవ్‌ అరోరా గెలుపొందారు. గుజరాత్‌లోని విసావదార్‌ అసెంబ్లీ స్థానంలో బీజేపీని ఓడించింది ఆప్. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి గోపాల్‌ ఇటాలియా విజయం సాధించారు. కేరళలోని నీలంబూర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆర్యధాన్‌ శోకత్‌ గెలుపొందారు. గుజరాత్‌లోని కాడీ స్థానంలో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర కుమార్‌ గెలిచారు. బెంగాల్‌లో తృణముల్‌ అభ్యర్థి అలిఫా అహ్మద్‌ భారీ మెజార్టీతో విజయం సాధించారు.

జూన్ 19న కేరళలోని నిలంబూర్, గుజరాత్‌లోని విసావదర్, కాడి.. పంజాబ్‌లోని లూధియానా వెస్ట్, పశ్చిమ బెంగాల్‌లోని కలిగంజ్‌ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్) మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

ఆప్ అభ్యర్థి గోపాల్ ఇటాలియా విశావదర్ స్థానాన్ని 17వేల 554 ఓట్ల ఆధిక్యంతో గెలుచుకోగా, బీజేపీ అభ్యర్థి రాజేంద్ర చావ్డా కాడి స్థానాన్ని 39వేల 452 ఓట్ల ఆధిక్యంతో గెలుచుకున్నారు. టీఎంసీ అభ్యర్థి అలీఫా అహ్మద్ కాలిగంజ్ స్థానంలో 49వేల 755 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆప్ అభ్యర్థి సంజీవ్ అరోరా లూథియానాలో 10,637 ఓట్ల ఆధిక్యంతో.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అభ్యర్థి ఆర్యదాన్ షౌకత్ నిలంబూర్‌లో సీపీఐఎం అభ్యర్థి ఎం స్వరాజ్‌పై 11వేల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

విస్తృతమైన వెబ్‌కాస్టింగ్ వ్యవస్థ ద్వారా ఉప ఎన్నికల ప్రక్రియను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. కేంద్ర బలగాల మోహరింపుతో గట్టి భద్రత మధ్య పోలింగ్ జరిగింది. ఈ ఉప ఎన్నికలను బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA), ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

పంజాబ్- లూథియానా వెస్ట్
జనవరిలో ఆప్ ఎమ్మెల్యే గురుప్రీత్ బస్సీ గోగి మరణంతో లూథియానా పశ్చిమ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఉప ఎన్నికలో మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఆప్, కాంగ్రెస్, బీజేపీ, శిరోమణి అకాలీదళ్ నుండి కీలక అభ్యర్థులు బరిలో నిలిచారు.

రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరా (61)ను ఆప్ బరిలోకి దింపగా, కాంగ్రెస్ పార్టీ మాజీమంత్రి భరత్ భూషణ్ అషు (51)ను నిలిపింది. ఆయన 2012, 2017లో రెండుసార్లు ఈ స్థానాన్ని గెలుచుకున్నారు. సీనియర్ నాయకుడు జీవన్ గుప్తాను బీజేపీ, పరూప్కర్ సింగ్ ఘుమాన్‌ను ఎస్‌ఏడీ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టింది. ఈ ఉప ఎన్నికలో 51.33% పోలింగ్ నమోదైంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో 64% ఓటింగ్ నమోదైంది.

కేరళ – నీలంబూర్
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన సన్నిహితుల నుండి వచ్చిన కొన్ని ఆరోపణల కారణంగా అన్వర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో నిలంబూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించారు. 10 మంది పోటీదారులలో ప్రధాన పోటీదారులు అధికార ఎల్‌డిఎఫ్ అభ్యర్థి ఎం స్వరాజ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్‌కు చెందిన ఆర్యదాన్ షౌకత్, టిఎంసి రాష్ట్ర కన్వీనర్ స్వతంత్ర అభ్యర్థి పివి అన్వర్, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు చెందిన మోహన్ జార్జ్ ఉన్నారు. ఐదు స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా.. నిలంబూర్‌లో అత్యధికంగా 75.27% ఓటింగ్ జరిగింది.

Also Read: మన దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ప్రస్తుతం ఏం జరుగుతోంది?

గుజరాత్ – విసావదర్, కడి
గుజరాత్‌లోని రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. జునాగఢ్ జిల్లాలోని విశావదర్ స్థానం డిసెంబర్ 2023 నుండి ఖాళీగా ఉంది. ఆ సంవత్సరం ఆప్ ఎమ్మెల్యే భూపేంద్ర భయానీ రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తీవ్రమైన త్రిముఖ పోటీలో బీజేపీ కిరీత్ పటేల్‌ను నామినేట్ చేసింది. కాంగ్రెస్ నితిన్ రాన్‌పారియాను నామినేట్ చేసింది. ఆప్ గుజరాత్ మాజీ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియాను నామినేట్ చేసింది.

మరోవైపు, బీజేపీ ఎమ్మెల్యే కర్సన్ సోలంకి మరణంతో ఫిబ్రవరి 4న మెహ్సానా జిల్లాలోని కడి సీటు ఖాళీ అయింది. బీజేపీ రాజేంద్ర చావ్డాను నిలబెట్టగా, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రమేష్ చావ్డాను నామినేట్ చేసింది. ఆప్ తన అభ్యర్థిగా జగదీష్ చావ్డాను ఎంచుకుంది. విశావదర్‌లో 56.89% మంది ఓటర్లు ఓటు వేయగా, కడిలో 57.91% పోలింగ్ నమోదైంది.

వెస్ట్ బెంగాల్ – కలిగంజ్
ఫిబ్రవరిలో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నసీరుద్దీన్ అహ్మద్ మరణంతో పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలోని కలిగంజ్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. అధికార పార్టీ ఈ ఉప ఎన్నికకు ఆయన కుమార్తె అలీఫా అహ్మద్‌ను బరిలోకి దింపింది.

బీజేపీ ఆశిష్ ఘోష్‌ను నామినేట్ చేయగా, కాంగ్రెస్ సీపీఐ(ఎం) మద్దతుతో కబిల్ ఉద్దీన్ షేక్‌ను ఎంచుకుంది. ముర్షిదాబాద్ అల్లర్లు, ఆపరేషన్ సిందూర్ తర్వాత తీవ్రమైన త్రిముఖ పోటీ మధ్య జూన్ 19న జరిగిన కాలిగంజ్ ఉప ఎన్నికలో 73.36% పోలింగ్ నమోదైంది.