ఇగోని పక్కన పెట్టండి.. మమతా బెనర్జీని ఇండియా కూటమికి లీడర్‌గా గుర్తించండి: ఎంపీ కల్యాణ్ బెనర్జీ
దేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, బీజేపీకి సవాలు విసరడానికి ఏకీకృత, నిర్ణయాత్మక నాయకత్వం కావాలని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ ఇగోని పక్కన పెట్టాలని, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ‘ఇండియా’ కూటమికి లీడర్‌గా గుర్తించాలని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ అన్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే.
ఆ పార్టీ పశ్చిమ బెంగాల్‌లో ఐదు అసెంబ్లీ స్థానాలను నిలుపుకోవడమే కాకుండా, ఇంతకుముందు బీజేపీ ప్రాతినిధ్యం వహించిన మదరిహట్‌లోనూ గెలుపొందింది. మరోవైపు మహారాష్ట్ర ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది.
దీంతో కాంగ్రెస్‌పై కల్యాణ్ బెనర్జీ విమర్శలు గుప్పించారు. దేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, బీజేపీకి సవాలు విసరడానికి ఏకీకృత, నిర్ణయాత్మక నాయకత్వం కావాలని చెప్పారు. మమతా బెనర్జీ తన నాయకత్వాన్ని ఇప్పటికే నిరూపించుకున్నారని, ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహించడానికి ఆమె సరైన నాయకురాలని అన్నారు.
కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఇటీవలి ఎన్నికలలో తమ వైఫల్యాలను అంగీకరించాలని చెప్పారు. వ్యక్తిగత లక్ష్యాల కంటే ఐక్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. వారు తమ అహాన్ని పక్కనపెట్టాలని, మమతా బెనర్జీని ఇండియా కూటమి నాయకురాలిగా అంగీకరించాలని చెప్పారు.
Ram Gopal Varma : రాంగోపాల్ వర్మ కోసం పోలీసుల వేట.. అరెస్ట్ పై పోలీసు అధికారి కీలక వ్యాఖ్యలు..