Jeremy Kessel : ‘నాన్ లోకల్’ ని గ్రీవెన్స్ అధికారిగా నియమించిన ట్విట్టర్
మోదీ సర్కార్ ఇటీవల తీసుకొచ్చిన నూతన ఐటీ రూల్స్ అమలులో భాగంగా సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్.. భారతదేశానికి కొత్త గ్రీవెన్స్ అధికారిగా కాలిఫోర్నియాకి చెందిన జెరెమి కెస్సెల్‌ను ఆదివారం నియమించింది.

Jeremy Kessel మోదీ సర్కార్ ఇటీవల తీసుకొచ్చిన నూతన ఐటీ రూల్స్ అమలులో భాగంగా సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్.. భారతదేశానికి కొత్త గ్రీవెన్స్ అధికారిగా కాలిఫోర్నియాకి చెందిన జెరెమి కెస్సెల్‌ను ఆదివారం నియమించింది. కొద్ది రోజుల క్రితం.. భారతదేశంలో ఫిర్యాదుల పరిష్కారాలకు ట్విట్టర్ నియమించిన తాత్కాలిక రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారి ధర్మేంద్ర చతూర్ ఆదివారం ఆ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వానికి-ట్విట్టర్‌కు మధ్య వైరం కొనసాగుతున్న నేపథ్యంలోనే చతూర్ తన పదవి నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. చతూర్ తప్పుకున్న గంటల వ్యవధిలోనే సంస్థ గ్లోబల్ లీగల్ పాలసీ డైరెక్టర్‌గా ఉన్న జెరెమి కెస్సెల్‌ను భారతదేశానికి గ్రీవెన్స్ అధికారిగా ట్విట్టర్ నియమించింది. అయితే, కొత్త ఐటీ రూల్స్ ప్రకారం..గ్రీవెన్స్ అధికారి భారతదేశ నివాసి అయి ఉండాలి. దీంతో జెరెమి కెస్సెల్ నియామకాన్ని భారత ప్రభుత్వం అంగీకరించట్లేదు.
కాగా, మే- 25 నుంచి సోషల్ మీడియా నియంత్రణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్‌మీడియేటరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్-2021 అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీని ప్రకారం 50 లక్షల మందికి పైగా యూజర్లు గల అన్ని సోషల్ మీడియా కంపెనీలు..ఆయా సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో వచ్చే పోస్టులపై ఫిర్యాదులను పరిష్కరించడానికి గ్రీవియెన్స్ అధికారిని నియమించాల్సి ఉంటుంది. పెద్ద సోషల్ మీడియా కంపెనీలు.. చీఫ్ కంప్లెయిన్ ఆఫీసర్,నోడల్ అధికారి, రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారిని నియమించడం తప్పనిసరి. అయితే వీరందరూ భారతీయులై ఉండాలి.
కొత్త రూల్స్ అమలు విషయంలో మొదట్లో ట్విట్టర్ మీన మేషాలు లెక్కించింది. దీంతో భారత ఐటీ నిబంధనల అమలుకు కట్టుబడి ఉన్నారా? లేదా? అన్న విషయమై ఈ నెల ఐదో తేదీన ట్విట్టర్‌కు కేంద్రం చివరి నోటీసు జారీ చేసింది. దీంతో ట్విట్టర్.. ధర్మేంద్ర చతూర్‌ను ఇంటరిం రెసిడెంట్ గ్రీవియెన్స్ అధికారిగా నియమించింది. ధర్మేంద్ర చతూర్ స్థానంలో ఇప్పుడు నియమితులైన జెరెమీ కెస్సెల్ చిరునామా అమెరికాలో ఉందని ట్విట్టర్ వెబ్‌సైట్ పేర్కొంది. కాగా, సకాలంలో స్పందించడంలో విఫలమైన ట్విట్టర్.. న్యాయ రక్షణను కోల్పోయిందని ఓ ప్రభుత్వ అధికారి తెలిపారు. ఇప్పటివరకు ఉన్న మధ్యవర్తిత్వ హోదా కోల్పోవడంతో ట్విట్టర్‌లో వచ్చే పోస్టులకు ఆ సంస్థే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు.