ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం

  • Published By: vamsi ,Published On : November 28, 2019 / 01:24 PM IST
ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం

Updated On : November 28, 2019 / 1:24 PM IST

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర 29వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఉద్ధవ్ థాకరే. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి మహా వికాస్ అఘాడి పేరుతో ఓ కూటమిగా ఏర్పడగా.. మూడు పార్టీల బలం 160కు పైగా చేరింది. దీంతో కూటమి నేతగా శివసేన చీఫ్ ఉద్ధవ్‌ను ఎన్నుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.

అసెంబ్లీ కానీ, శాసన మండలిలో గానీ సభ్యత్వం లేకుండానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఉద్ధవ్ థాకరే. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఉద్ధవ్ థాకరే పోటీ చేయలేదు. అయితే కుమారుడు ఆదిత్య థాకరేను మాత్రం ఎన్నికల బరిలో నిలిపారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వర్లీ అసెంబ్లీ స్థానం నుంచి తన వారసుడిని గెలిపించుకున్నారు.

బీజేపీతో కలిసి కూటమి కట్టి ఎన్నికల్లో పోటీ చేసిన శివసేన.. ఎన్నికల ఫలితాల తర్వాత 50-50 సీఎం సీటు కోసం పట్టు బట్టింది. ఈ క్రమంలోనే బీజేపీ కూటమికి గుడ్ బై చెప్పి చివరకు కాంగ్రెస్, ఎన్‌సీపీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాజకీయాల్లో అరంగేట్రం చేసినప్పటి నుంచీ ఇప్పటిదాకా ఉద్ధవ్ థాకరే ఒక్కసారిగా కూడా ఎన్నికల్లో పోటీ చేయలేదు. శాసన సభకు గానీ, లోక్ సభకు గానీ.. చివరికి శాసన మండలికి కూడా పోటీ చేయలేదు. అయితే ఏకంగా ముఖ్యమంత్రి పీఠం ఎక్కేశారు. 

ఇలా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉద్ధవ్ థాకరేది ఎనిమిదో వ్యక్తి. అంతకుముందు కాంగ్రెస్ నాయకులు ఏఆర్ అంతులే, వసంత్ దాదా పాటిల్, శివాజీరావు నిలంగేకర్ పాటిల్, శంకర్ రావు చవాన్, సుశీల్ కుమార్ షిండే, పృథ్వీరాజ్ చవాన్, ఒకప్పటి కాంగ్రెస్ నాయకుడు శరద్ పవార్ కూడా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఉద్ధవ్ థాకరే ఆరు నెలల్లోగా శాసన సభకు లేదా శాసన మండలికి ఎన్నిక కావాలి. ఆరు నెలల్లోగా ఆయన ఏదైనా ఒక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలి. ప్రస్తుతం శివసేనకు 58 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.