అన్ లాక్ 3.0 : ఆగస్టు-31 వరకు విద్యాసంస్థలు మూత

కరోనా లాక్‌డౌన్ నిబంధనలను దశల వారీగా సడలిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీచేసింది. జూలై 31తో అన్‌లాక్ 2.0 గడువు ముగియనుండటంతో.. ఆగస్ట్-1నుంచి ప్రారంభం కానున్న అన్ లాక్ 3.0 మార్గదర్శకాలు కేంద్ర హోమ్ శాఖ ఇవాళ(జులై-29,2020) విడుదల చేసింది.
పాఠశాలలు, కళాశాలలు, విద్యా, కోచింగ్ సంస్థలు ఆగస్టు 31 వరకు మూసివేయాలని కేంద్రం ఆదేశించింది. రాత్రి సమయాల్లో కర్ఫ్యూను ఎత్తివేశారు. ఈ మార్గదర్శకాలు ఆగస్టు 1వ తేదీ నుంచి అమలుకానున్నాయి. సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్మెంట్ పార్కులు, థియేటర్లు, బార్‌లు, ఆడిటోరియంలు, అసెంబ్లీ హాల్‌లు.. ఇలాంటి ప్రదేశాలను తెరిచి ఉంచడానికి అనుమతించబోమని మార్గదర్శకాలలో పేర్కొన్నది.
అయితే, యోగా ఇన్స్టిట్యూట్స్, వ్యాయామశాలలు ఆగస్టు 5 నుంచి పనిచేయడానికి అనుమతించారు. దీని కోసం స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) త్వరలో జారీ చేయనున్నారు. మెట్రో రైలు సేవలు, సామాజిక, రాజకీయ, క్రీడలు, వినోదం, విద్యా, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలు, పెద్ద సమ్మేళనాల కార్యకలాపాలు కూడా అనుమతించబడవు. పై కార్యకలాపాలను పున: ప్రారంభించే తేదీలు విడిగా రూపొందించనున్నారు. వీటికి కూడా అవసరమైన ఎస్ వోపీలు జారీ చేస్తారని మార్గదర్శకాల్లో వెల్లడించారు.