నన్ను గురువుగా స్వీకరించు…దీపికాకు రాందేవ్ సలహా

  • Published By: venkaiahnaidu ,Published On : January 14, 2020 / 07:37 AM IST
నన్ను గురువుగా స్వీకరించు…దీపికాకు రాందేవ్ సలహా

Updated On : January 14, 2020 / 7:37 AM IST

బాలీవుడ్ నటి దీపిక పదుకొణే జేఎన్ యూ విజిట్ పై విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. విద్యార్థులపై దాడి ఘటన తర్వాత గత వారం బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె వారికి మద్దతు తెలిపారు. క్యాంపస్‌కు వెళ్లి వారి ఆందోళనల్లో పాల్గొని, కేంద్రంపై విమర్శలు చేశారు. ఆమె అక్కడికి వెళ్లడంపై పలువురు రాజకీయ నాయకులు భిన్నంగా స్పందించారు. పలువురు బీజేపీ నేతలు.. దీపికా సినిమాలను బాయ్‌కాట్ చేయాలని పిలుపునివ్వగా.. కొందరు ఆమెకు తన భావాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉందన్నారు. దీపికాను టార్గెట్ చేస్తూ ఇప్పుడు విమర్శలు గుప్పించారు ప్రముఖ యోగా గురు బబా రాందేవ్. 

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాందేవ్ మాట్లాడుతూ…మొదట దీపికా పదుకొనణే భారతదేశంపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఆమెకు దేశ రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలపై అవగాహన లేదన్నారు. వీటిపై స్టడీ చేసి జ్ఞానం పెంచుకోవాలన్నారు. నటన వేరు విషయ పరిజ్ఞానం వేరన్నారు. భారతదేశం గురించి ఆమె తెలుసుకోవాల్సింది చాలా ఉందని, సరైన జ్ఞానం తెచ్చుకున్నాకే ఆమె దేశంలో జరుగుతున్న విషయాలపై పెద్ద నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం తనను గురువుగా స్వీకరించాల్సిన అవసరముందన్నారు. ఆమెకు మంచి సలహాలు ఇచ్చి, జ్ఞానాన్ని భోదించడానికి ‘స్వామి రామ్‌దేవ్’ లాంటి గురువు ఆమెకు అవసరమని తాను భావిస్తున్నానని చెప్పారు.

CAA (పౌరసత్వ సవరణ చట్టం) ఫుల్ ఫాం కూడా తెలియని వాళ్లు ప్రధాని మోడీని ఇష్టానుసారం తిడుతున్నారని రాందేవ్ ఈ సందర్భంగా అన్నారు. CAA వల్ల ఎవరికీ నష్టం లేదని, ఈ చట్టం కారణంగా ఏ ఒక్కరి పౌరసత్వం పోదని ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా వివరంగా చెబుతున్నారని, అయినా దీన్ని అర్థం చేసుకోకుండా కొందరు హింసను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.