నేవీ నూతన దళపతిగా కరమ్‌బీర్‌ సింగ్‌

  • Published By: veegamteam ,Published On : March 24, 2019 / 04:44 AM IST
నేవీ నూతన దళపతిగా కరమ్‌బీర్‌ సింగ్‌

Updated On : March 24, 2019 / 4:44 AM IST

ఢిల్లీ : భారత నావికాదళం తదుపరి అధిపతిగా వైస్‌ అడ్మిరల్‌ కరమ్‌బీర్‌ సింగ్‌ ఎంపికయ్యారు. ఆయన్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత చీఫ్‌ అడ్మిరల్‌ సునీల్‌ లాంబా మే 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో కరమ్‌బీర్‌ సింగ్‌ బాధ్యతలు చేపడతారని రక్షణ శాఖ తెలిపింది. 

విశాఖలోని ఈస్టర్న్‌ నేవల్‌ కమాండ్‌లో ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ ఛీఫ్‌(ఎఫ్‌వోసీ–ఇన్‌– సీ)గా ఉన్న కరమ్‌బీర్‌ మే 31వ తేదీన విధుల్లో చేరుతారని తెలిపింది. హెలికాప్టర్‌ పైలెట్‌ నేవీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనుండటం ఇదే ప్రథమం. అత్యంత సీనియర్‌ అధికారిని ఈ పదవికి నియమించాలన్న సంప్రదాయ విధానాన్ని పక్కనబెట్టి ప్రతిభే గీటురాయిగా కరమ్‌బీర్‌ను ఎంపిక చేసినట్లు రక్షణ శాఖ స్పష్టం చేసింది.

కరమ్‌బీర్‌ స్వస్థలం పంజాబ్‌లోని జలంధర్‌. 1959 నవంబర్‌ 3న ఆయన జన్మించారు. 1980 జూలై 1న నేవీలో చేరారు. 1982లో హెలికాప్టర్‌ పైలెట్‌గా ఎంపికయ్యారు. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (పూణె), డిఫెన్స్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కాలేజ్‌(వెల్లింగ్టన్‌) శిక్షణ పొందారు. చేతక్, కమోవ్‌ హెలీకాప్టర్ల పైలెట్‌గా విశేష అనుభవం కలిగివున్నారు. 37 ఏళ్ల సర్వీసులో ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ షిప్‌ చాంద్‌బీబీ, మిసైల్‌ కార్వెట్‌ ఐఎన్‌ఎస్‌ విజయ్‌దుర్గ్, గైడెడ్‌ మిసైల్‌ డెస్ట్రాయర్స్‌ ఐఎన్‌ఎస్‌ రాణా నౌకలకు కరమ్‌బీర్‌ సింగ్‌ కమాండర్‌గా పని చేశారు.