Shiv Sena MP : అవును..మేము సర్టిఫైడ్ గూండాలమే

శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Shiv Sena MP : అవును..మేము సర్టిఫైడ్ గూండాలమే

Shiv Sena Mp

Updated On : June 17, 2021 / 9:24 PM IST

Shiv Sena MP శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము సర్టిఫైడ్ గూండాలనని సంజమ్ రౌత్ వ్యాఖ్యానించారు. అయోధ్య ల్యాండ్ డీల్ వివాదం నేపథ్యంలో సామ్నా పత్రిక వేదికగా శివసేన విమర్శలు గుప్పించింది. ఈ విషయంలో నిరసన తెలిపేందుకు బుధవారం బీజేపీ నేతలు ముంబై దాదార్ ఏరియాలోని శివసేన పార్టీ కార్యాలయం దగ్గరికి చేరుకున్నారు. దీంతో శివసేన కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో బీజేపీ శివసేనపై విమర్శలు చేసింది. శివసేన కార్యకర్తలు పోకిరీలు,గూేడాలు అంటూ బీజేపీ విరుచుకుపడింది. తమ పార్టీ మహిళా సభ్యురాలిపై కూడా శివసేన కార్యకర్తలు దాడి చేశారని బీజేపీ ఆరోపించింది.

ఈ పరిణామాల నేపథ్యంలో గురువారం సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ..మేము గూండాలమని ఎవ్వరూ మాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన పనిలేదు. మేము అధికారిక గూండాలమే. మరాఠా ప్రతిష్ఠ విషయంలోనూ, హిందూత్వ విషయంలో తాము అధికారిక గూండాలమేనని సంజయ్ రౌత్ తెలిపారు. తమ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బాల్ థాకరే ఎప్పుడూ శివసేన భవన్‌లోనే ఉండేవారని ఈ సందర్భంగా రౌత్ గుర్తు చేశారు. తమపై ఎవరు ఆరోపణలు చేసినా, తాము సమాధానం ఇస్తామని, దీనిని కూడా గూండాగిరీ అంటే… తాము గూండాలమేనని రౌత్ వ్యాఖ్యానించారు. సామ్నా సంపాదకీయంలో తాము కేవలం అయోధ్య భూముల విషయంలో వివరణ మాత్రమే కోరామని, అంత మాత్రాన బీజేపీ ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తుందో తమకు అర్థం కావడం లేదన్నారు. ఈ దేశంలో వివరణ కోరడం కూడా ఓ నేరమేనా? అని రౌత్ సూటిగా ప్రశ్నించారు.

శివసేన ఎమ్మెల్యే సదా సర్వంకర్ మాట్లాడుతూ..బీజేపీ కార్యకర్తలు నిరసన తెలపడానికి వస్తున్నారని మాకు మొదట తెలిసింది, తరువాత వారు సేన భవన్ ను ధ్వంసం చేయడానికి వస్తున్నారని తెలుసుకున్నాము. అందువల్ల వారు దగ్గరకు రాకముందే మేము వారిని ఆపాము అని చెప్పారు.