Manipur Violence: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. అల్లర్లు ఎందుకు ఆగడం లేదు?

మణిపూర్‌ అల్లర్లకు.. మైతీలను ఎస్టీల్లో చేర్చాలన్న డిమాండ్ ఒక్కటే కారణం కాదు. ఈ హింసాత్మక ఘర్షణల వెనుక.. అనేక అంశాలు ముడిపడి ఉన్నాయ్.

Manipur Violence: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. అల్లర్లు ఎందుకు ఆగడం లేదు?

Manipur Violence

Manipur Violence Updates: అల్లర్లు ఆగిపోయి.. మంటలు చల్లారిపోయి.. మణిపూర్ మొత్తం ప్రశాంతంగా ఉందనుకున్న సమయంలో.. మళ్లీ హింస చెలరేగింది. తాజాగా ఉద్రిక్త పరిస్థితులతో.. ఇంఫాల్ ఈస్ట్, వెస్ట్ జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలను మరింత కఠినంగా మార్చేశారు. మొత్తం మీద మణిపూర్‌లోని 11 జిల్లాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. రాష్ట్రమంతటా ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపేశారు. తాజా ఘటనతో.. మైతీ-కుకీ జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి.

కుకీ గ్రామంపై దుండగుల దాడి
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌.. కొద్ది రోజులుగా హింసతో అట్టుడుకుతోంది. ఇప్పట్లో ఆ అల్లర్లకు.. తెరపడే సూచనలు కనిపించడం లేదు. ఉద్రికత్తలు తగ్గుముఖం పట్టినట్టే పట్టి.. మళ్లీ కాల్పుల మోత మోగింది. ఈస్ట్ ఇంఫాల్‌ జిల్లాలోని ఖమెన్‌లక్‌ ప్రాంతంలో ఉన్న ఓ కుకీ గ్రామంపై.. కొందరు దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో 9 మంది మృతిచెందగా.. పది మంది వరకూ గాయపడ్డారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. చనిపోయిన వారిలో ఓ మహిళ కూడా ఉంది. సాయుధ దుండగులు కుకీలకు చెందిన గ్రామాన్ని చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు. ఆ సమయంలో.. రెండు వర్గాలకు చెందినవారు పరస్పరం గాయపడ్డారు. ఇదే సమయంలో ఆందోళనకారులు ఓ మంత్రి నివాసానికి కూడా నిప్పంటించారు. వెస్ట్ ఇంఫాల్ జిల్లా లాంఫెల్ ప్రాంతంలోని పరిశ్రమల శాఖ మంత్రి నెమ్చా కిపిజెన్ బంగ్లాపై దాడి చేసి.. నిప్పంటించారని.. అక్కడి అధికారులు తెలిపారు. ఆ సమయంలో మంత్రి ఇంట్లో లేరు. దాడి చేసిన దుండగుల కోసం భద్రతా బలగాలు, పోలీసులు గాలింపు చేపట్టారు.

మరింత కఠినంగా ఆంక్షలు
తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో కర్ఫ్యూ ఆంక్షలను పోలీసులు కఠినతరం చేశారు. వెస్ట్ ఇంఫాల్‌, ఈస్ట్ ఇంఫాల్ జిల్లాల్లో ఉదయం 5 నుంచి సాయంత్రం 6 దాకా సాగుతున్న కర్ఫ్యూ సడలింపుని.. ఉదయం 5 నుంచి 9 వరకే పరిమితం చేశారు. మొత్తం మీద మణిపుర్‌లోని 11 జిల్లాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. మరోవైపు.. రాష్ట్రమంతా ఇంటర్నెట్‌ సేవలను నిలిపేశారు. తాజా ఘటనతో.. మైతీ-కుకీ జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలింది. అక్కడ శాంతి నెలకొల్పే ప్రయత్నాల్లో భాగంగా.. కొన్ని రోజుల కిందట కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అక్కడ పర్యటించారు. శాంతి కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ప్రజల మధ్య సామాజిక ఐక్యత, పరస్పర అవగాహనను ఈ కమిటీ పటిష్ఠం చేస్తుందని.. మైతీ, కుకీ తెగల మధ్య పరస్పరం సత్సంబంధాలు పునరుద్ధరిస్తుందని అంతా అనుకున్నారు. కొన్ని రోజుల్లోనే.. మణిపూర్‌లో ఉద్రిక్తతలు క్రమంగా చల్లారి.. శాంతి నెలకొంటుందని భావించారు. కానీ.. ఇంతలోనే.. మళ్లీ అల్లర్లు చెలరేగుతాయని ఎవరూ ఊహించలేదు.

గత 40 రోజులుగా గిరిజనులు, గిరిజనేతరుల మధ్య ఘర్షణలు, ఉద్రిక్తతలు, కాల్పులతో.. మణిపూర్ రగులుతూనే ఉంది. తమను ఎస్టీల్లో చేర్చాలని మైతీలు చేస్తున్న డిమాండ్లకు.. మణిపూర్‌ లోయలోని కొందరు ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. దాంతో.. గిరిజన ఆదివాసీ కుకీ తెగ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో.. మైతీలను ఎస్టీలో చేర్చే అంశంపై కేంద్రానికి రెండు వారాల్లోనే నివేదిక ఇవ్వాలన్న గౌహతి హైకోర్టు ఆదేశాలు.. అల్లర్లకు ఆజ్యం పోశాయి. ఎస్టీల్లో చేర్చాలన్న మైతీల డిమాండ్‌కు వ్యతిరేకంగా మే 3న కుకీలు ట్రైబల్ సాలిడారిటీ మార్చ్‌ చేపట్టారు. అప్పటి నుంచే ఘర్షణలు చెలరేగాయి. శాంతిభద్రతలను అదుపులో పెట్టేందుకు.. ఆర్మీతో పాటు పారామిలటరీ బలగాలు కూడా మణిపూర్ చేరుకున్నాయి. కానీ.. అల్లర్లను అదుపు చేయలేకపోయాయి.

మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు మృతుల సంఖ్య వంద దాటింది. వందలాది మందికి గాయాలయ్యాయి. చాలా ఇళ్లు, వాహనాలు, దుకాణాలకు ఆందోళనకారులు నిప్పంటించారు. హింసాత్మక ప్రాంతాల్లో నివసించే ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించి తాత్కాలిక వసతి ఏర్పాటు చేశారు. మణిపూర్‌లో శాంతిభద్రతలను ఎలాగైనా సరే అదుపులోకి తేవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావించాయి. ఇందులో భాగంగా.. ప్రభుత్వం శాంతి చర్చలకు అంతా సిద్ధం చేసింది. కానీ.. మైతీలు, కుకీలు శాంతి చర్చలను బహిష్కరించాలని నిర్ణయించడంతో.. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. సీఎం బీరెన్ సింగ్‌ని ఆ చర్చల్లో చేర్చడంపై.. కుకీ గ్రూపులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తర్వాత.. పర్ధాని మైతీ పౌర సమాజం కన్వీనర్ జీతేంద్ర నింగోంబాను సభ్యునిగా నియమించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. దాంతో.. పరిస్థితులు మళ్లీ అదుపు తప్పాయి.

రెండు సామాజిక తెగల మధ్య తీవ్ర ఘర్షణలు
మణిపూర్‌ అల్లర్లకు.. మైతీలను ఎస్టీల్లో చేర్చాలన్న డిమాండ్ ఒక్కటే కారణం కాదు. ఈ హింసాత్మక ఘర్షణల వెనుక.. అనేక అంశాలు ముడిపడి ఉన్నాయ్. అవే.. సమస్యను మరింత జఠిలం చేస్తున్నాయ్. వాస్తవానికి మణిపూర్‌లో జాతుల పరమైన ఉద్రిక్తతలు, ఘర్షణలు కొత్తేమీ కాదు. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో వాటిని ఆపేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ.. శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయి. కానీ.. ఇప్పుడు అక్కడి సర్కార్ కూడా ఏమీ చేయలేకపోతోంది. ఈసారి మణిపూర్‌లో శాంతిని నెలకొల్పే ప్రయత్నాలకు.. అనేక కారణాలు అడ్డంకులుగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ప్రధానంగా.. కుకీ జాతికి చెందిన వాళ్లలో.. సీఎం బీరెన్ సింగ్‌, ఆయన పాలన, రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదు. ఇప్పుడు కూడా పోలీసులు కుకీలపై దాడులకు పాల్పడుతున్నారని.. వాళ్లను టార్గెట్ చేసిన మైతీ గ్రూపులను నియంత్రించేందుకు ఏమీ చేయడం లేదని ఆరోపిస్తున్నారు. కుకీలు ముందు నుంచీ మైతీలతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపైనా అపనమ్మకంతో ఉన్నారు.

Also Read: మణిపూర్‭లో శాంతిభద్రతలు విఫలం.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

మణిపూర్ జనాభాలో మైతీలు 53 శాతం మంది ఉన్నారు. వీళ్లంతా.. ఎక్కువగా ఇంఫాల్ లోయల్ నివసిస్తుంటారు. అలాగే.. గిరిజనులైన నాగాలు, కుకీలు రాష్ట్ర జనాభాలో 40 శాతంగా ఉన్నారు. వీళ్లంతా.. ఎక్కువగా కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఈ ఏడాది మొదట్లో.. మణిపూర్ ప్రభుత్వం ఏకపక్షంగా అనేక ప్రాంతాలను రిజర్వ్ ఫారెస్ట్‌లుగా ప్రకటించింది. వందలాది మంది కుకీలను భూముల నుంచి దూరం చేసింది. ఇక.. మరో కీలక అంశం ఏమిటంటే.. గత కొన్నేళ్లలో రాష్ట్రంలో కుకీల జనాభాలో విపరీతమైన పెరుగుదల కనిపించింది. ఇందుకు.. మయన్మార్ నుంచి పెద్ద ఎత్తున అక్రమ వలసదారులు వచ్చారని.. రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే మైతీల కంటే ఎక్కువ మంది కుకీ జాతికి చెందిన వాళ్లు బాధితులుగా మారారని.. ప్రాణ నష్టంతో పాటు ఇండ్లు కూడా కోల్పోయారని.. ఉన్న ప్రాంతాల నుంచి వలస వెళ్లాల్సి వచ్చిందని చెబుతున్నారు. ప్రభుత్వం తమ పట్ల పక్షపాతంతో వ్యవహరించడం వల్లే.. తాము ఎక్కువగా నష్టపోయామని కుకీలు నమ్ముతున్నారు.

Also Read: ప్రొ.హరగోపాల్ మీద పెట్టిన UAPA కేసును వెంటనే ఎత్తివేయండి.. డీజీపీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు

మణిపూర్ అల్లర్లకు.. రెండు వైపులా అనేక కారణాలున్నాయి. కుకీలు, మైతీలు.. ఒకరిపై ఒకరికి ఆరోపణలు, అనుమానాలు ఉన్నాయి. కొండల్లోని తమ భూములను స్వాధీనం చేసుకునేందుకు.. మెజారిటీగా ఉన్న మైతీ జాతి పన్నిన పన్నాగమే.. ఎస్టీ హోదా డిమాండ్ అని కుకీలు చెబుతున్నారు. అయితే.. మైతీలు మాత్రం మణిపూర్‌లో కుకీలు జనాభాపరమైన మార్పు కోరుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇందుకు.. కొన్ని గణాంకాలు కూడా చెబుతున్నారు. 2011లో కుకీల జనాభా 4 లక్షల 70 వేలుగా ఉంది. ఇది.. మణిపూర్ మొత్తం జనాభాలో 16.4 శాతం. ఇప్పుడున్న అంచనాల మేరకు.. 2022లో కుకీల జనాభా 9 లక్షల 26 వేలు. ఇదే.. అందరిలోనూ అనుమానం రేకెత్తిస్తోంది. 2021లో.. మణిపూర్ స్టేట్ బర్త్ రేటు వెయ్యికి.. 13 మందిగా ఉంది. ఆ లెక్కన.. కుకీల జనాభా గతేడాది నాటికి.. దాదాపు ఐదున్నర లక్షలుగా ఉండాలి. మరి.. మిగతా కుకీలంతా ఎక్కడి నుంచి వచ్చారన్నదే.. అసలైన ప్రశ్న. ఇప్పుడు కుకీలుగా చెప్పుకుంటున్న వాళ్లలో.. చాలా మంది మయన్మార్ నుంచి అక్రంగా వలసొచ్చిన వాళ్లేనని.. మైతీలు, మణిపూర్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అందువల్ల.. NRC నిర్వహించి.. రాష్ట్రంలోని అక్రమ వలసదారులను గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీపై ట్విటర్‭లో విమర్శలు.. బీజేపీ జనరల్ సెక్రెటరీ అరెస్ట్

మయన్మార్ నుంచి వస్తున్న కుకీలు.. కొండల్లో పెద్ద ఎత్తున గసగసాలు సాగు చేస్తున్నారని.. మణిపూర్‌ని ఓపియం, డ్రగ్స్‌కు కేంద్రంగా మార్చారని.. మైతీలు ఆరోపిస్తున్నారు. ఇంఫాల్ లోయ బయట ఉన్న ప్రాంతాల్లో సొంత ఆస్తుల హక్కును తిరస్కరించడం కూడా అన్యాయమని మైతీలు భావిస్తున్నారు. ఇక.. విస్తృతంగా ఆయుధాలు లభించడం, కేంద్రం చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇవ్వకపోవడం, కేంద్ర ప్రభుత్వం ఆలస్యంగా జోక్యం చేసుకోవడం లాంటివి.. రాష్ట్రంలో శాంతి నెలకొల్పేందుకు ఆటంకంగా మారుతున్న అంశాలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా.. మైతీలు, కుకీలు రాష్ట్రంలో పరిపాలనపై విశ్వాసం కోల్పోవడం వల్లే.. అల్లర్లు ఆగడం లేదనే వాదనలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మణిపూర్‌లో శాంతి నెలకొనాలంటే.. కేంద్రం జోక్యం చేసుకోవాలని, ప్రధాని మోదీ మాట్లాడాలనే.. డిమాండ్లు కూడా వస్తున్నాయి. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే.. మణిపూర్ పరిస్థితిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.