దీపావళి వేళ టపాసులపై నిషేధం ఉన్నప్పటికీ వాటిని కాల్చడంపై సుప్రీంకోర్టు సీరియస్.. ఢిల్లీ ప్రభుత్వానికి, పోలీసులకు నోటీసులు
కనీసం వచ్చే ఏడాది అయినా టపాసులు కాల్చకుండా ఒక యంత్రాంగాన్ని రూపొందించాలని పేర్కొంది.

Supreme Court
ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీపావళి వేళ టపాసులపై నిషేధం ఉన్నప్పటికీ చాలా మంది వాటిని కాల్చడంపై జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.
ఢిల్లీ ప్రభుత్వానికి, పోలీసులకు నోటిసులు జారీ చేసింది. బాణసంచా వాడకాన్ని నిషేధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు, వాటిని అమలు చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై వివరాల అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ఆదేశించింది.
ఢిల్లీలో టపాసుల వాడకంపై పూర్తి నిషేధాన్ని అమలు చేయడానికి పోలీసులు తీసుకున్న చర్యలను సూచిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కి నోటీసులు జారీ చేసింది.
ఢిల్లీ ప్రభుత్వం, పోలీసులు కలిసి వచ్చే ఏడాది ప్రజలు బాణసంచా కాల్చకుండా ఎలాంటి పటిష్ఠ చర్యలు తీసుకుంటారో తెలియజేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఢిల్లీ ప్రభుత్వం, పోలీస్ కమిషనర్ వారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
తదుపరి విచారణను నవంబర్ 14కి వాయిదా వేసింది. అలాగే, అక్టోబరు చివరన 10 రోజుల్లో పంట వ్యర్థాలను తగులబెట్టిన ఉదంతాల సంఖ్యకు సంబంధించిన వివరాలను అఫిడవిట్‌లను దాఖలు చేయాలని హరియాణా, పంజాబ్ ప్రభుత్వాలను ఆదేశించింది.
ఢిల్లీలో బాణసంచాపై నిషేధం అమలు చేయలేదని విస్తృతంగా వార్తలు వచ్చాయని గుర్తు చేసింది. కనీసం వచ్చే ఏడాది అయినా టపాసులు కాల్చకుండా ఒక యంత్రాంగాన్ని రూపొందించాలని పేర్కొంది.
“లాంగ్ లివ్ క్రిటిక్స్” అంటూ విజయ్‌కు కౌంటర్ ఇచ్చిన సీఎం స్టాలిన్