పార్సీ సంప్రదాయానికి భిన్నంగా రతన్ టాటా అంత్యక్రియలు.. కారణం ఏంటి..

పార్సీల విశ్వాసాల ప్రకారం.. శరీరాన్ని దహనం చేయడం లేదా ఖననం చేయడం ప్రకృతి విరుద్ధం.

పార్సీ సంప్రదాయానికి భిన్నంగా రతన్ టాటా అంత్యక్రియలు.. కారణం ఏంటి..

Ratan Tata Final Rites (Photo Credit : Google)

Updated On : October 12, 2024 / 7:24 AM IST

Ratan Tata Final Rites : దేశం ఓ దిగ్గజ వ్యాపారవేత్తను, అంతకుమించి గొప్ప మానవతా వాదిని కోల్పోయింది. రతన్ టాటా అక్టోబర్ 9న ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. రతన్ టాటా ఇక లేరనే వార్త యావత్ భారతాన్ని శోకసంద్రంలో ముంచేసింది. దూరదృష్టితో కూడిన నాయకత్వం రతన్ టాటా సొంతం. సామాజిక బాధ్యతలోనూ ఆయనకు సాటి లేరు. టాటా గ్రూపును ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఘనత దక్కించుకున్నారు. అంతేకాదు కోట్లాది మంది జీవితాలపై ప్రభావం చూపించారు. దేశ పారిశ్రామిక వృద్ధికి ఆయన చేసిన అపారమైన కృషికి నివాళులర్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలు నిర్వహించిన విషయం విదితమే.

అయితే, రతన్ టాటా పార్సీ మతస్తుడు. అయినప్పటికీ అంత్యక్రియలను పార్సీ సంప్రదాయంలో  (భౌతికకాయాన్ని రాబందులకు ఆహారంగా పెట్టడం) కాకుండా విద్యుత్ యంత్రంపై దహనం చేశారు. ఎందుకిలా చేయాల్సి వచ్చిందంటే..

నేల, గాలి, నీరు, అగ్ని కలుషితం చేయరు..
హిందువులు మృతదేహాలను దహనం చేస్తారు. ఇస్లాం, క్రైస్తవులు ఖననం చేస్తారు. వీరు చేసే అంత్యక్రియలతో పోలిస్తే.. జొరాస్ట్రియన్ పార్సీల అంత్యక్రియలు పూర్తి భిన్నంగా ఉంటాయి. పార్సీలు.. మనిషి దేహాన్ని ప్రకృతి బహుమతిగా భావిస్తారు. అందుకే వారు.. చనిపోయాక.. భౌతికదేహాన్ని తిరిగి ప్రకృతికే ఇచ్చే ట్రెడిషన్ ను పాటిస్తారు. పార్సీల విశ్వాసాల ప్రకారం.. శరీరాన్ని దహనం చేయడం లేదా ఖననం చేయడం ప్రకృతి విరుద్ధం. అలా చేయడం వల్ల ప్రకృతి వనరులైన నేల, గాలి, నీరు, అగ్ని కలుషితం అవుతాయని బలంగా నమ్ముతారు. కట్టెలపై చనిపోయిన వారిని దహనం చేయడం ద్వారా అగ్నిని అగౌరవపరిచినట్లుగా, అపవిత్రం చేసినట్లుగా నమ్ముతారు. అందుకే, ప్రత్యేక విధానంలో అంతిమ సంస్కారాలు పూర్తి చేస్తారు. పార్థివదేహాన్ని రాబందులకు ఆహారంగా పెడతారు.

Also Read : దేశంలో ఎందరో వ్యాపార దిగ్గజాలు ఉన్నా.. ప్రజల మదిలో రతన్ టాటాకే ఎందుకు శిఖర స్థాయి?

అంత్యక్రియలకు ముందుగా.. పార్సీ సంప్రదాయం ప్రకారం ప్రార్థనలు చేస్తారు. అనంతరం శరీరాన్ని ప్రత్యేక ప్రదేశానికి తీసుకెళ్తారు. దాన్ని టవర్ ఆఫ్ సైలెన్స్ లేదా దఖ్మా అని పిలుస్తారు. అంటే.. రాబందులు వచ్చి తినేందుకు వీలుగా ఉండే ప్రదేశంలో భౌతిక కాయాన్ని ఉంచుతారు. ఈ మొత్తం పద్ధతిని దోఖ్ మేనాశిని అని పిలుస్తారు. దీని అర్థం ఏంటంటే.. మన శరీరం ప్రకృతి నుంచి వచ్చిందని, అలాగే తిరిగి ప్రకృతిలోనే ఐక్యమవ్వాలన్నది పార్సీల విశ్వాసం.

పార్సీ సంప్రదాయానికి భిన్నంగా రతన్ టాటా అంతిమ సంస్కారాలు..
పార్ధివ దేహానికి పార్సీలు అంత్యక్రియలు నిర్వహించే అసలు సంప్రదాయం ఇదే. అయితే, రతన్ టాటా విషయంలో అందుకు భిన్నంగా జరిగింది. పార్సీ సంప్రదాయం ప్రకారం కాకుండా ఎలక్ట్రిక్ యంత్రాలపై శరీరం ఉంచి దహనం చేశారు. దీనికి కారణం లేకపోలేదు. పర్యావరణ పరిస్థితులు ఇప్పుడూ పూర్తిగా మారిపోయాయి. ఇక రాబందుల సంఖ్య చెప్పాల్సిన పనే లేదు. భారీగా రాబందుల సంఖ్య తగ్గిపోయింది. అసలు రాబందులు కనిపించడమే అరుదుగా మారింది. ఈ సమస్యల కారణంగా దఖ్మా పద్ధతిలో అంత్యక్రియలు చేయడం ఇబ్బందిగా మారింది. ఈ పరిస్థితుల్లో సోలార్ లేదా కరెంట్ విధానంలో దహన వాటికల్లోనే అంత్యక్రియులు నిర్వహిస్తున్నారు పార్సీలు.

తాము పూజించే అగ్నిని కలుషితం చేయకుండా.. భౌతికదేహాలను విద్యుత్ శ్మశానవాటికకు తీసుకువెళతాము లేదా బయోగ్యాస్ ద్వారా దహనం చేస్తాము అని పార్సీ జొరాస్ట్రియన్ లు తెలిపారు.

రతన్ టాటా అంతిమ సంస్కారాలు సాంప్రదాయ పార్సీ పద్ధతులకు విరుద్ధంగా దహనం చేశారు. ముంబైలోని వర్లీ శ్మశానవాటికలో రెండు ఎలక్ట్రిక్ యంత్రాలపై శరీరాన్ని ఉంచి దహన సంస్కారాలు పూర్తి చేశారు.

Also Read : టాటా ట్ర‌స్టుల చైర్మ‌న్‌గా నోయ‌ల్ టాటా.. ఏక‌గ్రీవంగా ఎన్నుకున్న బోర్డు స‌భ్యులు