భారత విదేశాంగ మంత్రి పాకిస్థాన్‌కు ఎందుకు వెళ్తున్నారు? ఎస్‌సీవో ప్రాధాన్యం ఏంటి?
మధ్య ఆసియాలో ఆర్థిక భద్రతతో పాటు పలు అంశాలను షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌లో చర్చిస్తారు.

Foreign Minister Jaishankar
పాకిస్థాన్‌లో జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) సదస్సులో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొని భారత ప్రతినిధుల బృందానికి నాయకత్వం వహించనున్నారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత పాక్‌లో భారత విదేశాంగ మంత్రి పర్యటన ఖరారు అయింది.
ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీని పాకిస్థాన్ ఆహ్వానించింది. అయితే, భారత్ తరఫున జైశంకర్ పాల్గొననున్నారు. అసలు ఎస్‌సీవో అంటే ఏమిటి? ఈ సదస్సు కోసం జైశంకర్‌ని ఇస్లామాబాద్‌కు పంపాలని భారతదేశం ఎందుకు నిర్ణయం తీసుకుందో చూద్దాం..
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌లో భారత్, పాకిస్థాన్ 2017లో చేరాయి. 1996లో చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిజ్‌స్తాన్, తజికిస్తాన్ కలిసి షాంఘై ఫైవ్ గా ఏర్పడ్డాయి. భద్రతాపరమైన అంశాల్లో సహకరించడానికి ఇది ఏర్పడింది.
ఇదే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌గా 2001లో చైనా, రష్యా, కజకిస్తాన్ , కిర్గిజ్‌స్తాన్ , తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్యదేశాలుగా రూపుదిద్దుకుంది. ఇప్పుడు వీటిలో భారత్, పాకిస్థాన్, బెలారస్, ఇరాన్ కూడా ఉన్నాయి.
అఫ్ఘానిస్థాన్, మంగోలియా పరిశీలక దేశాలుగా కొనసాగుతున్నాయి. మధ్య ఆసియాలో ఆర్థిక భద్రతతో పాటు పలు అంశాలను షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌లో చర్చిస్తారు. 2023లో ఎస్‌సీవో సదస్సుకు భారత్ నేతృత్వం వహించింది. ఇప్పుడు ఈ నెల 15, 16 తేదీల్లో పాకిస్థాన్‌లో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.
ఎస్‌సీవో సభ్యుడిగా పాల్గొనేందుకు మాత్రమే తాను పాకిస్థాన్‌కు వెళ్తున్నానని ఇప్పటికే జైశంకర్ తెలిపారు. పాకిస్థాన్‌కు వెళ్తున్నది ఎస్‌సీవో ప్రభుత్వాధినేతల సమావేశం కోసమేనని స్పష్టం చేశారు. భారత్‌లాగే పాకిస్థాన్ కూడా కూటమిలో సభ్యదేశంగా ఉందని అన్నారు. చివరిసారిగా పాకిస్థాన్‌కు భారత ప్రభుత్వం నుంచి 2015లో అప్పటి కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ వెళ్లారు.
Delhi: అయ్యోపాపం.. నిద్రిస్తున్న యువకుడిని దారుణంగా కొట్టిన వ్యక్తి.. వీడియో వైరల్