పాక్ చెరలో పైలట్ బతికున్నాడా? : దశాబ్దాల నుంచి భార్య ఎదురు చూపులు

భార్యాభర్తల బంధానికి అసలైన నిర్వచనం చెబుతోంది ఓ భార్య. పెళ్లయి ఏడాదిన్న అయ్యింది. అంతలోనే దేశ సేవ కోసం వెళ్లిపోయిన భర్త..ఆ వెళ్లిన వాడు ఈనాటికి తిరిగి రాలేదు. అసలు బ్రతికున్నాడో లేదో కూడా తెలీదు. కానీ ఆ భార్య మాత్రం ఈనాటికి ఎదురు చూస్తునే ఉంది.
నాలుగు దశాబ్దాలుగా పాకిస్థాన్ జైళ్లలో మగ్గుతున్న భారత సైనికులు ఈనాటి వరకు స్వదేశానికి చేరుకోనేలేదు. వారిలో విజయ్ వసంత్ తాంబే అనే విమాన పైలట్ కూడా ఒకరు. భారత వాయుసేనలో ఫ్లైట్ లెఫ్టినెంట్ గా పనిచేస్తున్న తాంబే 1971లో పాకిస్థాన్ కు పట్టుబడ్డాడు. ఆ వార్తను రేడియోలో (అప్పటికి టీవీలు ఇతర ప్రచారం సాధనాలు పెద్దగా లేవు) విన్న అతడి భార్య దయమంతి తాంబే కుప్పకూలిపోయింది. గుండెలవిసేలా ఏడ్చింది. ఆనాటి నుంచి ఆ గుండె బరువును మోస్తునే ఉంది. అప్పటికి వారి పెళ్లయి కేవలం 18 నెలలే అయింది.భర్తతో కొత్త మురిపెం కూడా తీరని ఆ ఇల్లాలికి అది గుండెకోతే అయ్యింది.
దయమంతి తాంబే సాధారణ మహిళ మాత్రం కాదు. ఆమె మూడు సార్లు జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్. ఆటలో ఎదురయ్యే ఆటుపోట్టతో పాటు నిజజీవితంలో ఎదురైన ఈ విషమ పరిస్థితులను కూడా తట్టుకుంటు భర్త కోసం ఎదురు చూస్తునే ఉంది. భర్త మిస్ అయినప్పటి నుంచీ..అప్పటినుంచి ఆమె తిరగని ప్రభుత్వ ఆఫీస్ లేదు..కలవని ప్రధాని లేరు. ఇప్పటివరకు ఎంతమంది ప్రధానులు పనిచేశారో అందరినీ కలిసి తన భర్త గురించి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు దమయంతి. ఆమెకిప్పుడు 70 సంవత్సరాలు.
దక్షిణ ఢిల్లీలోని మాణిక్ విహార్ లో తన చిన్న ఫ్లాట్ లో భర్త జ్ఞాపకాలతో కుమిలిపోవడం ఆమె నిత్యజీవితంలో భాగమైపోయింది. పెళ్లయిన కొత్తలో కాశ్మీర్ కు హనీమూన్ వెళ్లగా, అక్కడి ప్రకృతి అందాల్లో భర్తతో కలిసి తీయించుకున్న ఫొటోలే ఇప్పుడామెకు తరగని ఆస్తిగా మారాయి. ఆ ఫొటో ఆల్బంను గుండెకు పొదువుకుని భర్త ఎప్పటికైనా తిరిగొస్తాడని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది దయమంతి.
ఒకసారి పాకిస్థాన్ లో మగ్గిపోతున్న భారత ఖైదీల బంధువులకు తమవారిని చూసే అవకాశం వచ్చింది. మరికొన్ని గంటల్లో పాకిస్థాన్ వెళతామని అనుకునేంతలో రాజకీయ కారణాలతో ఆ పర్యటన రద్దయిపోయింది. అలాంటి చేదు అనుభవాలు దమయంతిని కొత్తల్లో చాలా బాధపెట్టేవి కానీ ఇప్పుడవి అలవాటయిపోయాయి. భర్త దూరమయ్యాడు కానీ..అతని జ్ఞాపకాలతో ఆమె వెన్నంటే ఉన్నాయమంటు అంటూ జీవంలేని నవ్వును ముఖంపై పులుముకుంటు బ్రతుకుని వెళ్లదీస్తోంది దమయంతి తాంబే.. వైఫ్ ఆఫ్ ఫ్లయిట్ లెఫ్టినెంట్ విజయ్ వసంత్ తాంబే.