Lindsey Graham: భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఛిద్రం చేస్తాం: అమెరికా హెచ్చరిక
రష్యాతో వ్యాపారాన్ని కొనసాగించే దేశాలపై 500 శాతం టారిఫ్‌లు విధించేందుకు గ్రాహం గతంలోనూ బిల్లును ప్రతిపాదించారు.

రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తుండడంపై భారత్‌తో పాటు చైనా, బ్రెజిల్ దేశాలకు అమెరికా మరోసారి హెచ్చరిక జారీ చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు అత్యంత సన్నిహితుడు లిండ్సే గ్రాహం తాజాగా మాట్లాడుతూ.. భారత్, చైనా, బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థలను నాశనం చేస్తామని చెప్పారు. రష్యాతో చమురు లావాదేవీలు కొనసాగిస్తే ఆయా దేశాలపై అధిక శాతం టారిఫ్‌లు విధిస్తామని చెప్పారు.
రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపకపోతే 100 శాతం టారిఫ్ విధించే యోచనలో ట్రంప్ సర్కారు ఉందని లిండ్సే చెప్పారు. రష్యా ముడిచమురు ఎగుమతుల్లో 80 శాతం వరకు వాటా ఈ మూడు దేశాలదని, ఈ కొనుగోళ్ల ద్వారానే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై యుద్ధానికి నిధులు సమకూర్చుకుంటున్నారని ఆరోపించారు.
“రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై టారిఫ్‌లు విధిస్తాం. చైనా, భారత్, బ్రెజిల్ దేశాలు రష్యా నుంచి చమురును చీప్‌గా కొనుగోలు చేస్తూ ఈ యుద్ధాన్ని కొనసాగనిస్తే, మేము మీ ఆర్థిక వ్యవస్థలను ఛిద్రం చేస్తాం” అని ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో అన్నారు. రష్యాతో వ్యాపారాన్ని కొనసాగించే దేశాలపై 500 శాతం టారిఫ్‌లు విధించేందుకు గ్రాహం గతంలోనూ బిల్లును ప్రతిపాదించారు.
పుతిన్‌కు గురించి గ్రాహం మాట్లాడుతూ.. “ట్రంప్‌ను మోసం చేయడం వల్ల మీకే నష్టం జరుగుతుంది. పెద్ద తప్పు చేశారు. మీ ఆర్థిక వ్యవస్థ మరింత పతనం అవుతుంది. మేము ఉక్రెయిన్‌కు ఆయుధాలు పంపిస్తున్నాం, వాళ్లు పుతిన్‌తో పోరాడతారు. సోవియట్ యూనియన్‌ను తిరిగి తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నారు. 1990 దశకంలో ఉక్రెయిన్ 1,700 అణ్వాయుధాలను వదిలేసింది. యుక్రెయిన్ సార్వభౌమత్వాన్ని గౌరవిస్తామని అప్పట్లో రష్యా హామీ ఇచ్చింది. ఆ హామీని పుతిన్ ఉల్లంఘించారు” అని అన్నారు.
భారత్ వైఖరి ఇలా..
భారత్ ఎప్పుడూ తన ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ విషయాన్ని పలుసార్లు స్పష్టం చేసింది. ఇటీవల నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టే కూడా భారత్, చైనాను హెచ్చరించిన విషయం తెలిసిందే.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై టారిఫ్ విధిస్తామని హెచ్చరించారు. ఆ సమయంలో భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రంధీర్ జైస్వాల్ స్పందిస్తూ.. “ఈ అంశంపై వచ్చిన నివేదికలను గమనించాం.. మేము గతంలో చెప్పినట్లే, మా ప్రజల అవసరాలను తీర్చడానికే ప్రాధాన్యమిస్తాం. మాకు లభించే మార్కెట్ అవకాశాలు, ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మేము ముందుకు సాగుతాం” అని అన్నారు.