తమిళనాట కొత్త పార్టీ, రాజకీయాల్లోకి మళ్లీ ఆళగిరి

తమిళనాట కొత్త పార్టీ, రాజకీయాల్లోకి మళ్లీ ఆళగిరి

Updated On : December 24, 2020 / 6:37 PM IST

Will Not Work With DMK – MK Alagiri : తమిళనాడు రాష్ట్రంలో మరో కొత్త పార్టీ రానుందా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. దివంగత సీఎం కరుణానిధి పెద్ద కుమారుడు ఆళగిరి మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. జనవరి 03వ తేదీన అనుచరులతో సమావేశం అనంతరం కొత్త పార్టీపై నిర్ణయాన్ని ప్రకటిస్తానని వెల్లడించారు. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి ముందుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. గతంలో సోదరుడు స్టాలిన్ (MK Stalin)‌తో విబేధాల వల్ల…డీఎంకే (Dravida Munnetra Kazhagam) పార్టీ నుంచి ఆళగిరి బహిష్కరణకు గురైన సంగతి తెలిసిందే.

ఆళగిరి మరోసారి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలని భావిస్తున్నారు. డీఎంకే (DMK)లో ఆళగిరి, స్టాలి‌న్‌లు కలిసే ఉన్నారు. అయితే..స్టాలిన్‌తో చాలాకాలంగా విబేధాలు కొనసాగుతూ వచ్చాయి. తండ్రి కరుణానిధి మరణంతో..స్టాలిన్‌తో పూర్తిగా విబేధించారు. చాలాకాలం పాటు మిన్నకుండిపోయారు. మధురై, సేలం తదితర జిల్లాల్లో ఆళగిరికి గట్టిపట్టు ఉంది. ఈ క్రమంలో..2020, డిసెంబర్ 24వ తేదీ గురువారం చెన్నైకి వచ్చారాయన. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కొత్త పార్టీ పెట్టాలని సూచిస్తే మాత్రం అలాగే చేస్తానని, అయితే..డీఎంకేకు మాత్రం మద్దతివ్వను అంటూ అళగిరి స్పష్టం చేయడం విశేషం.

తమిళనాడు (Tamilnadu) రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఇటీవలే జరిగిన లోక్ సభ (Loksabha), అసెంబ్లీ (Assembly) ఎన్నికల్లో స్టాలిన్ ఆధ్వర్యంలోని డీఎంకే సత్తా చాటింది. రజనీకాంత్ (Rajanikanth) పెట్టబోయే కొత్త పార్టీ వైపు ఆళగిరి చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఆళగిరి కొత్త పార్టీ పెట్టి రజనీకాంత్‌కు మద్దతు తెలియచేస్తారా ? కొత్త పార్టీతోనే జనంలోకి వెళుతారా ? అనే చర్చ హాట్ హాట్‌గా సాగుతోంది.