కేజ్రీవాల్ ఉగ్రవాది…ఆధారాలున్నాయంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

  • Published By: venkaiahnaidu ,Published On : February 3, 2020 / 05:34 PM IST
కేజ్రీవాల్ ఉగ్రవాది…ఆధారాలున్నాయంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

Updated On : February 3, 2020 / 5:34 PM IST

ఢిల్లీ ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. పోలింగ్ కు రోజులు దగ్గరపడుతున్న కొద్ది ఎన్నికల ప్రచారాల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. గెలుపు కోసం అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే ఈ సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఓ ఉగ్రవాది అంటూ కేంద్రమంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ సీఎం ఉగ్రవాది అని నిరూపించేందుకు పలు ఆధారాలున్నాయని కేంద్ర మంత్రి అన్నారు.

నేను టెర్రరిస్టునా అంటూ కేజ్రీవాల్‌ అమాయకుడిలా ఢిల్లీ ప్రజలను అడుగుతున్నారని, అందుకు సమాధానం ఆయన టెర్రరిస్టేనని అన్నారు. గతంలో తాను అరాచకవాదినని కేజ్రీవాల్‌ స్వయంగా చెప్పుకున్నారని, అరాచకవాదికి, ఉగ్రవాదికి మధ్య పెద్ద వ్యత్యాసమేమీ ఉండదని జవదేకర్‌ అన్నారు. అయితే గత నెల 25న కూడా బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మఇలానే కేజ్రీవాల్ ఉగ్రవాది అని ఆరోపణలు మొదటిగా చేశారు. అయితే వెంటనే వర్మ వ్యాఖ్యలపై స్పందించిన ఎలక్షన్ కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. నాలుగు రోజులు వర్మ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించింది. ఇప్పుడు కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.

కాగా కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై ఆప్‌ తీవ్రంగా స్పందించింది. ఈ తరహా భాషను వాడిన జవదేకర్‌పై కూడా చర్యలు చేపట్టాలని ఆ పార్టీ ఎంపీ సంజయ్‌ సింగ్‌ ఈసీని డిమాండ్‌ చేశారు. కేజ్రీవాల్‌ ఉగ్రవాది అయితే ఆయనను అరెస్ట్‌ చేయాలని సంజయ్‌ సింగ్‌ బీజేపీని డిమాండ్‌ చేశారు. దేశ రాజధానిలో ఈసీ కొలువుతీరిన ప్రాంతంలోనే కేంద్ర మంత్రి ఇలాంటి భాషను వాడటాన్ని ఎలా అనుమతిస్తారని సింగ్‌ ప్రశ్నించారు. 

కే్జ్రీవాల్ కూడా జావదేకర్ వ్యాఖ్యలపై స్పందించారు. తాను టెర్రిస్టును ఎలా అయ్యానో చెప్పాలన్నారు. తాను కానీ తన కుటుంబం కానీ కలలో కూడా అలా ఆలోచనలు చేయలేదని, దేశం కోసం తాను ప్రాణాలు ఆర్పించేందుకు సిద్ధంగా ఉన్నానని ఎమోషనల్ అయ్యారు కేజ్రీవాల్. తనపై చేసిన ఆరోపణలు తనకు చాలా బాధ కలిగించాయన్నారు. తాను ఢిల్లీ ప్రజల కొడకునో,సోదరుడినో లేక ఉగ్రవాదినో అనేది  తాను ఢిల్లీ ప్రజలకే వదిలిపెడుతున్నానని కేజ్రీవాల్ అన్నారు. ఫిబ్రవరి-8నఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా,ఫిబ్రవరి-11న ఫలితాలు వెలువడనున్నాయి.