Gedam Nagesh : మద్దతివ్వండి ప్లీజ్‌.. సొంత పార్టీ నేతలకే అభ్యర్ధి వేడుకోలు, ఆదిలాబాద్‌ బీజేపీలో అసమ్మతి రాగం

మోడీ ఫొటోతో రెబల్‌గా బరిలోకి దిగేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారు. అభ్యర్థిని మార్చి పార్టీని నిలబెట్టిన వారికి పట్టం కట్టకపోతే ఆదిలాబాద్‌ స్థానంలో నష్టం తప్పదని కూడా వారు పార్టీ అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు.

Gedam Nagesh : మద్దతివ్వండి ప్లీజ్‌.. సొంత పార్టీ నేతలకే అభ్యర్ధి వేడుకోలు, ఆదిలాబాద్‌ బీజేపీలో అసమ్మతి రాగం

Gedam Nagesh : మద్దతివ్వండి ప్లీజ్‌.. ఇది సొంత పార్టీ నేతలకే ఓ అభ్యర్ధి వేడుకోలు.. అదేంటి ఓటర్లను వేడుకోవాల్సిన వ్యక్తి పార్టీ నేతలను అడగడమేంటి అనుకుంటున్నారా..! అవును.. కమలం పార్టీ అభ్యర్ధిగా ఆదిలాబాద్‌ టికెట్‌ దక్కించుకున్న గెడం నగేష్‌ పరిస్థితి ఇది. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా మారింది ఆయన పరిస్థితి..

లోకల్ లీడర్స్ నుంచి ప్రతికూలత..
గత ఎన్నికల్లో ఆదిలాబాద్‌ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కానీ.. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో లోక్‌సభ పరిధిలోని నాలుగు సీట్లను కైవసం చేసుకుంది బీజేపీ. దీంతో సిట్టింగ్‌ ఎంపీ సోయం బాపురావుతో పాటు ఈ సీటును దక్కించుకునేందుకు సీనియర్‌ లీడర్లు పోటీపడ్డారు. కానీ వాళ్ల ఆశలపై నీళ్లు చల్లింది బీజేపీ అధిష్టానం. గులాబీ నేత గెడం నగేష్‌కు కండువా కప్పి ఎంపీ టికెట్‌ ఇచ్చింది. ఐతే టికెట్‌ దక్కించుకున్నంత ఈజీగా లేదు నగేష్‌కు.. లోకల్‌ లీడర్స్‌ నుంచి ఆయనకు ప్రతికూలత ఎదురవుతోంది.. దీంతో ఎన్నికల సమయానికి పరిస్థితి ఏంటనే డైలమాలో పడ్డారు నగేష్‌.

భైంసా మున్సిపాలిటీ చేజార్చిన వ్యక్తికి టిక్కెట్టా?
భైంసా మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎంఐంఎం గెలవడానికి పరోక్షంగా కారణమైన వ్యక్తికి ఎంపీ సీటిచ్చారని మెజార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ సమయంలో జరిగిన మతకల్లోలాలకు కూడా అతనే కారణమనేది వారి ఆరోపణ. అంతేకాదు ప్రస్తుతం పార్టీకి ఉన్న సానుకూల అవకాశాలను క్యాష్‌ చేసుకునేందుకే నగేష్‌ పైరవీ చేసి టికెట్‌ దక్కించుకున్నారని కూడా వారంటున్నారు.

దయచేసి మద్దతివ్వండని వేడుకోలు..
టికెట్‌ దక్కించుకున్న తరువాత ఆదిలాబాద్‌లో జరిగిన నగేష్‌ సన్మాన సభకు సైతం పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు ఎవరూ హాజరుకాలేదు.. అంతేకాదు ప్రచార కార్యక్రమాలకూ ఎవరూ కలసిరాని పరిస్థితి ఉండటంతో బహిరంగ వేదికల మీదనే దయచేసి మద్దతివ్వండి అంటూ నగేష్‌ ఆడగడం పొలిటికల్‌ సర్కిల్స్‌లో ఆసక్తికరంగా మారింది.

అభ్యర్థిని మార్చకపోతే నష్టం తప్పదని వార్నింగ్..
నగేష్‌ ప్రచారం ఇలా కొనసాగుతుండగానే మరోవైపు అసంతృప్తులు మరో యాక్షన్‌ ప్లాన్‌తో పొలిటికల్‌ గ్రౌండ్‌లోకి దిగిపోయారు. మోడీ ఫొటోతో రెబల్‌గా బరిలోకి దిగేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారు. అభ్యర్థిని మార్చి పార్టీని నిలబెట్టిన వారికి పట్టం కట్టకపోతే ఆదిలాబాద్‌ స్థానంలో నష్టం తప్పదని కూడా వారు పార్టీ అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు.

Also Read : ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో పదవుల చిచ్చు.. సీఎం రేవంత్‌పై సీనియర్లు సీరియస్