టీడీపీ-జనసేన మ్యానిఫెస్టో రెడీ..! సంక్రాంతికి విడుదల..! ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా కూడా రిలీజ్?
ఇప్పటికే భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో టీడీపీ, జనసేన ప్రజల్లో ప్రచారం చేస్తున్నాయి. సూపర్ 6 పేరుతో రాజమండ్రి మహానాడులో గతేడాది మినీ మేనిఫెస్టో విడుదల చేశారు చంద్రబాబు.

TDP Janasena Manifesto Ready To Release
TDP Janasena Manifesto : ఏపీలో ఎన్నికల వేడి పీక్స్ కి చేరింది. గెలుపు లక్ష్యంగా అధికార, ప్రతిపక్షాలు వ్యూహ రచన చేస్తున్నాయి. ఇక ఎన్నికల్లో ముఖ్యమైన అంశం మ్యానిఫెస్టో. దీనిపై టీడీపీ-జనసేన దృష్టి పెట్టాయి. సంక్రాంతికి చంద్రబాబు, పవన్ మ్యానిఫెస్టో విడుదల చేయనున్నారు. ప్రతి చేనుకు నీరు – ప్రతి చేతికి పని.. టీడీపీ జనసేన లక్ష్యం పేరుతో ఎన్నికలకు వెళ్లనున్నాయి రెండు పార్టీలు.
ఇప్పటికే భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో టీడీపీ, జనసేన ప్రజల్లో ప్రచారం చేస్తున్నాయి. సూపర్ 6 పేరుతో రాజమండ్రి మహానాడులో గతేడాది మినీ మేనిఫెస్టో విడుదల చేశారు చంద్రబాబు. సంక్రాంతికి పూర్తి స్థాయి మేనిఫెస్టో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు.
సంక్రాంతికి టీడీపీ తొలి జాబితా విడుదల..! అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు గోప్యత
అలాగే సంక్రాంతికి టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. వివిధ నివేదికల ఆధారంగా వడపోత ప్రారంభించింది టీడీపీ అధిష్టానం. పోటీ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు చంద్రబాబు. దాదాపు 90 సీట్లపై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. సంక్రాంతికి 50 నియోజకవర్గాల అభ్యర్థులతో జాబితా విడుదల చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ముఖ్యమైన నేతలకు సంబంధించిన నియోజకవర్గాలు, వివాదం కానివి మాత్రమే ఫస్ట్ లిస్టులో ఉండే అవకాశం ఉంది.
Also Read : ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం? టీడీపీ లేదా జనసేనలోకి ముద్రగడ పద్మనాభం?
అభ్యర్థుల ఎంపికపై గోప్యత పాటిస్తున్నారు చంద్రబాబు. పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించే సీట్లను పక్కన పెట్టి, మిగిలిన వాటిపై నిర్ణయాలు తీసుకుంటున్నారు. అభ్యర్థుల ఎంపికలో ఎటువంటి సిఫార్సులు లేవని టీడీపీ హైకమాండ్ తేల్చి చెప్పింది. రాబిన్ శర్మ, పీకే టీమ్ లతో పాటు వివిధ ఏజెన్సీలతో నివేదికలు తెప్పించుకుంటున్నారు చంద్రబాబు. అభ్యర్థుల ఎంపికలో సీనియర్, జూనియర్ అనే తేడా లేదని.. గెలుపు మాత్రమే ప్రామాణికం అని తేల్చేశారు.
Also Read : గెలుస్తున్నాం.. గెలిచేస్తున్నాం.. ఇప్పుడిదే విజయ రహస్యం, ఎన్నికల ఫలితాలను శాసిస్తున్న ఫీల్ ఫ్యాక్టర్
జనసేన మేనిఫెస్టో రూపకల్పనపై చర్చ..
మరోవైపు ‘ప్రతి చేతికి పని-ప్రతి చేనుకి నీరు’ లక్ష్యం దిశగా జనసేన-టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చ జరిగింది. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విజయవాడలో పార్టీ మేనిఫెస్టో కమిటీతో సమావేశం అయ్యారు. జనసేన పార్టీ మేనిఫెస్టో రూపకల్పనపై చర్చించారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుదల, వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా నిలవడం, పేద ప్రజల సంక్షేమం, మహిళా భద్రత, రాష్ట్ర అభివృద్ధి తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించిన షణ్ముఖ వ్యూహంలోని అంశాలను ఆధారంగా చేసుకొని రాష్ట్రంలోని ప్రతి వర్గం సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకోవాలని కమిటీ సభ్యులకు సూచించారు నాదెండ్ల మనోహర్. ఇటీవల తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కమిటీ సభ్యులతో సమావేశమైనప్పుడు చర్చించిన అంశాలను జనసేన సభ్యులు వివరించారు. త్వరలో ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామని, ఇందుకు సంబంధించిన చర్చలు వేగవంతం చేయాలని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
- జనసేన మేనిఫెస్టో కమిటీకి వినతులు, సూచనలు.
- జనసేన మేనిఫెస్టో కమిటీకి వివిధ వర్గాలు, సంఘాల నుంచి వినతులు, సూచనలు అందాయి.
- వీటిని ఈ సమావేశంలో పరిశీలించారు.
- కాపు సంక్షేమ సేన తరపున ఆ సంస్థ వ్యవస్థాపకులు చేగొండి హరిరామ జోగయ్య పంపిన పీపుల్స్ మేనిఫెస్టోపై చర్చించారు.
- జనసేన మేనిఫెస్టో కమిటీని ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్, పార్సిల్ లారీ అసోసియేషన్, ట్రాలర్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి రవాణా రంగంలోని సంక్షోభాన్ని తెలియచేస్తూ ఈ రంగాన్ని ప్రోత్సహించాలని కోరారు.
- ఏపీ నిరుద్యోగ ఐక్యకార్యాచరణ సమితి ప్రతినిధులు తమ సమస్యలను, నోటిఫికేషన్లు విడుదల కాకపోవడంతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెల్లడించి వినతి పత్రం అందచేశారు.